
చండూరు (మర్రిగూడ) వెలుగు: నియోజకవర్గ ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పని చేస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల స్కూల్‌లో రూ. 1. 50 కోట్ల సొంత నిధులతో నిర్మించిన తరగతి గదులను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు. ఫౌండేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ మాట్లాడుతూ.. సేవ చేయాలంటే పదవులు అవసరం లేదన్నారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే దంపతులు భోజనం వడ్డించారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, ఎంఈఓ శ్రీనివాస్ ఎంపీడీవో మునయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు పాశం సురేందర్ రెడ్డి, మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.