Womens World Cup 2025: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి.. టీమిండియా సెమీస్‌కు వెళ్తుందా..?

Womens World Cup 2025: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి.. టీమిండియా సెమీస్‌కు వెళ్తుందా..?

వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేసులో ముందుకు సాగాలంటే గెలవాల్సిన మ్యాచ్‌‌లో ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లాండ్ పై ఓడిపోయింది. ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే 2025 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు వెళ్లే సెమీ ఫైనల్ కు వెళ్లడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం ఓటములతో ఢీలా పడుతుంది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత టీమిండియా విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 

తొలి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచి బోణీ కొట్టిన కౌర్ సేన.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారీ విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వరుసగా మూడు పరాజయాలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. సౌతాఫ్రికాపై గెలిచే మ్యాచ్ లో ఓడిన మన జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై భారీ స్కోర్ చేసి పరాజయం పాలయ్యారు. తాజాగా ఇంగ్లాండ్ పై 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఓవరాల్ గా ఐదు మ్యాచ్ ల్లో రెండు గెలిచి.. మూడు మ్యాచ్ ల్లో ఓడింది. సెమీస్ కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు  మ్యాచ్ ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. 

టీమిండియా మహిళల జట్టుకు తమ తదుపరి మ్యాచ్ లో గురువారం (అక్టోబర్ 23) న్యూజిలాండ్ రూపంలోనూ కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో పని లేకుండా రాయల్ గా సెమీస్ లోకి అడుగుపెట్టవచ్చు. రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా ఒక మ్యాచ్ లో గెలిచినా సెమీస్ కు చేరొచ్చు. కానీ అదే సమయంలో న్యూజిలాండ్ తమ చివరి రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో భారీగా ఓడిపోవాలి. రెండు మ్యాచ్ ల్లో గెలిచి దర్జాగా సెమీస్ లోకి అడుగుపెడుతుందో లేకపోతే ఒక మ్యాచ్ లో గెలిచి ఇతర ఫలితాలపై ఆధారపడుతుందో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో స్మృతి మంధాన (94 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 88), కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (70 బాల్స్‌‌లో 10 ఫోర్లతో 70), దీప్తి శర్మ (57 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 50) పోరాడినా టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం (అక్టోబర్ 19) జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ 4 రన్స్‌‌ స్వల్ప తేడాతో ఇండియాపై గెలిచి సెమీస్‌‌కు క్వాలిఫై అయ్యింది.  టాస్‌‌ గెలిచిన ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో 288/8 స్కోరు చేసింది. హీథర్‌‌ నైట్‌‌ (91 బాల్స్‌‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 109) సెంచరీతో చెలరేగింది. లక్ష్య ఛేదనలో ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.