
- 'తుర్కపల్లి పీహెచ్సీలో ఎక్స్పైరీ మందులు' అనే కథనానికి స్పందన
- ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
యాదగిరిగుట్ట, వెలుగు: తుర్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్పైరీ మందులు ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసీ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ‘తుర్కపల్లి పీహెచ్సీలో ఎక్స్పైరీ మందులు’ పేరుతో ‘వెలుగు’ లో శనివారం పబ్లిష్ అయిన వార్తా కథనానికి కలెక్టర్ హనుమంతరావు స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆదివారం నివేదికను కలెక్టర్ కు సమర్పించారు.
పేషెంట్ తొలిచుక్క అంజయ్యకు ఫార్మసీ ఆఫీసర్(కాంట్రాక్ట్ ఉద్యోగి) మహేశ్వరి ఎక్స్పైరీ అయిన మందులు, ఇంజక్షన్ ఇవ్వగా.. విషయాన్ని గమనించకుండా నర్సింగ్ ఆఫీసర్(కాంట్రాక్ట్ ఉద్యోగి) రజిత పేషెంట్ కు ఇంజక్షన్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. నర్సింగ్ ఆఫీసర్ రజిత గతంలో కూడా ఇలాంటి తప్పే చేయడంతో అధికారులు తొలి తప్పుగా భావించి హెచ్చరించగా.. మళ్లీ అదే తప్పును రిపీట్ చేసినట్లు విచారణలో తేలింది.
దీంతో అధికారుల రిపోర్ట్ ఆధారంగా ఫార్మసీ ఆఫీసర్ మహేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్ రజితను సస్పెండ్ చేస్తూ.. ఆదివారం కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.