
- ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లు 1657
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: లిక్కర్ షాపులు దక్కించుకునేందుకు వ్యాపారులు ఏకమవుతున్నారు. 2023–25 లో అధిక సేల్స్ జరిగిన షాపులపై దృష్టి సారించి టెండర్లు వేస్తున్నారు. ఈ ఏడాది లిక్కర్ పాలసీలో షాపుల దరఖాస్తు ఫీజు పెరగడంతో వ్యాపారులు టెండర్ వేయడానికి వెనుకాడుతున్నారు. గతేడాది లిక్కర్ టెండర్ల ద్వారా ములుగు, భూపాలపల్లి జిల్లా నుంచి 2166 దరఖాస్తులు రాగా, సర్కారుకు రూ.43.32 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రెండు జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 1657 దరఖాస్తులు రాగా, ఈనెల 23 వరకు దరఖాస్తుల గడువు పొడిగించడంతో మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
లెక్కలు చూసి దరఖాస్తులు..
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏ ఏరియాలో వైన్స్ లో ఎంత మద్యం అమ్మకాలు జరుగుతాయనే దానిపై లెక్కలు చూసి వ్యాపారులు దరఖాస్తులు వేస్తున్నారు. ఎంత వ్యాపారం జరిగితే ఎంత లాభం అనేది చూసుకొని షాపులను ఎంచుకుంటున్నారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యక్తిగతంగా టెండర్ వేస్తే షాపులు దక్కే పరిస్థితి లేకపోవడంతో సిండికేట్గా మారి సేల్స్ ఎక్కువగా ఉండే షాపులను ఎంచుకొని టెండర్ వేస్తున్నారు.
ఏడాదికి రూ.10 కోట్లకు మించి వ్యాపారం చేస్తున్న షాపులకు దరఖాస్తులు వేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు ములుగు జిల్లాలోని మల్లంపల్లి షాప్ నంబర్ 40 కి 72 దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉండగా, భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి షాపు నంబర్ 18కి 63 దరఖాస్తులు, మహాముత్తారం మండలం యామన్ పల్లి షాప్ నంబర్ 29కి 58, గణపురం మండలం చెల్పూర్లోని షాపు నంబర్ 32 కు 58 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి, రేగొండ, కాటారం, కాళేశ్వరం, తాటిచర్ల షాపులకు సైతం డిమాండ్ ఉండడంతో దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో వచ్చాయి. ఏజెన్సీ ఏరియాలో షాపులకు డిమాండ్ లేకపోవడంతో వ్యాపారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. శనివారం నాటికి చివరి గడవుగా ఉన్నా గోవిందరావుపేట షాపు దరఖాస్తుల బోని కొట్టలేదు. కొన్నిచోట్ల ఒక్కోటి చొప్పున దరఖాస్తులే వచ్చాయి. పెరిగిన గడువుతో ప్రతి షాపుకు మినిమమ్ 10 దరఖాస్తులు వచ్చేలా ఆఫీసర్లు ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మేడారం జాతరతో లాభాలు పొందే అవకాశం ఉంటుందని వ్యాపారులకు ఫోన్లు చేస్తూ టెండర్ కి రావాలని పిలుస్తున్నట్లుగా తెలుస్తుంది.
టార్గెట్ చేరుకునేనా..
గతేడాది టార్గెట్ రీచ్ కావడానికి ఎక్సైజ్ ఆఫీసర్లు వ్యాపారులకు ఫోన్ చేసి టెండర్లకు ఆహ్వానిస్తున్నట్లుగా పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. దరఖాస్తుల ప్రారంభం నుంచి టెండర్ల ప్రక్రియ మందకోడిగా సాగగా, శనివారం ఒక్కరోజే ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి 1032 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం అనూహ్యంగా టెండర్ల గడవు ఈనెల 23 వరకు పెంచడంతో గతేడాది వచ్చిన 2166 దరఖాస్తులకు మించి వచ్చేలా ఆఫీసర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది.