- గుంతలతో కరీంనగర్సిటీ ప్రయాణికుల అవస్థలు
- టీ ఫైబర్ కోసమే అంటున్న అధికారులు
- పైపులు లీకవడంతో కుంగుతున్న రోడ్లు
- అధికారుల మధ్య కొరవడిన సమన్వయం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో కొత్తగా వేసిన రోడ్లను ఆర్ అండ్ బీ సిబ్బంది ఎక్కడ పడితే అక్కడే తవ్వేస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టీ ఫైబర్ లైన్లు వేయడానికి చాలా చోట్ల రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు తీస్తున్నారు. ఫైబర్ వేసే సంగతి ముందే తెలిసినా అధికారుల మధ్య సమన్వయం లేక రోడ్లను తవ్వి పాడు చేస్తున్నారు. మరో వైపు మెయిన్ రోడ్ల కింద ఉన్న భారీ పైపులో నుంచి వాటర్ లీకవుతుండటంతో పలుచోట్ల రోడ్లు కుంగిపోతున్నాయి. అధికారులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో.. ఎక్కడ ఏ రోడ్ కుంగిపోతుందోననే సిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ముందే తెలిసినా..
సిటీలోని ప్రధానమైన ఆర్అండ్ బీ రోడ్లపై పెద్ద గుంతలు తవ్వుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక్కో గుంత దగ్గర మూడునాలుగు రోజులు పనులు చేస్తున్నారు. గుంతలు తవ్వి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులను తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రోడ్లు తవ్వి పూడ్చే బాధ్యత కూడా టీ ఫైబర్ కు సంబంధించిన కాంట్రాక్టర్లదే ఉంటుంది. అయినా నామమాత్రంగా పూడ్చి వదిలేస్తున్నారు. దీంతో ఈ వర్షాకాలంలో రోడ్లు మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. గతంలో కరీంనగర్ ఆర్అండ్ బీ రోడ్లు పలు చోట్ల కుంగిపోయి ఇక్కడి రోడ్ల నాణ్యతను బయటపెట్టాయి. కరీంనగర్ సిటీలో సుమారుగా 14.5 కిలోమీటర్ల మేర ఆర్అండ్ బీ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల వెంట దాదాపుగా స్మార్ట్ సిటీలో రెన్నోవేషన్ అయ్యాయి. ఈ రోడ్లకు రెండు వైపులా కొత్తగా డ్రెయిన్లు కూడా నిర్మించారు. కాలువలు నిర్మించే టైమ్ లోనే మళ్లీ రోడ్లు తవ్వే అవసరం రాకుడదని డ్రెయిన్ తోపాటు మరో కాలువ కూడా నిర్మించారు. భవిష్యత్ లో ఎటువంటి కేబుల్స్ అయినా.. వేసుకోవడానికి అనుకూలంగా ఉండాలని నిర్మాణాలు చేపట్టారు. కానీ వీటిని ఏ మాత్రం వినియోగించుకోకుండా రోడ్లను ఇష్టారీతిన నాశనం చేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నో ప్లానింగ్..
బల్దియాలో జరుగుతున్న పనులపై ఇతర శాఖల అధికారులతో ఎలాంటి సమన్వయం ఉండటం లేదు. అధికారులకు కూడా ప్లానింగ్ ఉండటం లేదు. దీంతో సిటీలో రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేస్తున్నారు. దీంతో నాణ్యత దెబ్బతింటోంది. అధికారులు రోడ్లు వేసే ముందే ఆ రోడ్ కింద నుంచి వెళ్లే పైపు లైన్ లు చెక్ చేయడం లేదు. స్మార్ట్ సిటీ పనులు చేపడుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ఆఫీసర్లను సంప్రదించకపోవడంతో ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. ‘అక్కడ లీకేజీలు ఉన్నాయి.. సరి చేసి రోడ్లు వేయండి’.. అని స్థానికులు అడిగినా వారి మాటలు పట్టించుకోకుండా రోడ్లు వేశారు. ఫలితంగా వేసిన కొత్త రోడ్లను తవ్వాల్సిన దుస్థితి నెలకొంది. సిటీలో ఏ ప్రధాన రోడ్ తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర తవ్వకాలు చేపడుతునే ఉంటారు. ఇకనైనా బల్దియా అధికారులు దృష్టి సారించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
లీకేజీలతో కుంగుతున్నయ్..
కరీంనగర్ టౌన్లో ఇప్పటికి చాలాసార్లు రోడ్లు కుంగినా అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల అంబేద్కర్ చౌరస్తాలో సిటీలో తాగు నీరందించే మెయిన్ పైప్ లైన్ లీకవడంతో రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. నాలుగైదు రోజులపాటు నీరంతా రోడ్డు పాలైంది. ఆ టైమ్ లో సిటీలో పూర్తిగా నీటి కరువు ఏర్పడింది. అయినా ఆఫీసర్లు నిదానంగా పైపు లైన్ రిపేర్ చేశారు. వారం కిందట కమాన్ నుంచి బస్టాండ్ వెళ్లే రోడ్డులో ఎస్ బీఐ బ్యాంకు దగ్గర ఇలాగే లీకేజీలు కావడంతో రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. దీన్ని మరమ్మతులు చేపట్టానికి నాలుగు రోజులు పట్టింది. ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్ వేశారు. కానీ అక్కడ లీకేజీ ఉందని పూర్తిగా రోడ్డు తవ్వేసి మరమ్మతులు చేపట్టారు. జ్యోతినగర్ సంతోషీమాత గుడి నుంచి మంకమ్మతోట వరకు వెళ్లే రోడ్ లో ఈ మధ్యే రోడ్ వేశారు. కానీ అక్కడ డ్రెయిన్ కట్టడం మరిచిపోయారు. డ్రెయిన్ నిర్మాణం కోసం రోడ్ ను సగానికన్నా ఎక్కువగా తవ్వేశారు.
