డిప్యూటీ సీఎంకు రూ.50 వేల పెనాల్టీ

డిప్యూటీ సీఎంకు రూ.50 వేల పెనాల్టీ
  • విధించిన బెంగళూరు మున్సిపల్ అధికారులు
  • పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీ పెట్టినందుకేనని వివరణ

బెంగళూరు: రూల్స్​కు విరుద్ధంగా ఫ్లెక్సీ పెట్టినందుకు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​కు అధికారులు రూ.50,000 పెనాల్టీ విధించారు. బెంగళూరు క్వీన్స్​రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయం వద్ద కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం శివకుమార్​తో సహా మరికొందరు నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 

ఈ విషయం తెలియడంతో అధికారులకు మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లి ఫ్లెక్సీని తొలగించారు. అనుమతి లేకుండా పెట్టినందుకు శివకుమార్​కు జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని బెంగళూరు మున్సిపల్ కమిషనర్ ఖాతాలో జమ చేయాలని నోటీసులు పంపారు. 

బెంగళూరులో అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం హోదాలో డీకే శివకుమార్ 13 రోజుల కింద నిషేధం విధించారు. ఫ్లెక్సీలతో అనేక సమస్యలు వస్తున్నాయని, సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలను కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే పెనాల్టీ విధించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. 

ఈ ఆర్డర్స్ ఇచ్చిన 13 రోజులకే ఆయన ఫొటోతోనే ఏర్పాటైన ఫ్లెక్సీ విషయంలో అధికారులు జరిమానా విధించారు.