తుది దశకు కర్నాటక ఎన్నికలు

 తుది దశకు కర్నాటక ఎన్నికలు

కర్నాటక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. పార్టీలు అంతిమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీల చివరి అస్త్రమైన పోల్​మేనేజ్​మెంట్​ ఎన్నికల ఫలితాన్ని ఏమైనా ప్రభావితం చేయగలదా? ఏ మేరకు దాన్ని ప్రభావం ఉండే అవకాశం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. కర్నాటక బరిలో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీతోపాటు జేడీ(ఎస్) ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి.  అయితే ఈ మూడు పార్టీల నుంచి బరిలో దిగిన అభ్యర్థుల్లో చాలా మంది డబ్బు పలుకుబడి ఉన్నవారే కావడం గమనార్హం. అయితే పోల్ ​మేనేజ్​మెంట్​ అందరికీ అంత ఈజీ టాస్క్​కాదు. 

కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి.1985 నుంచి ఇక్కడ ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఓడిపోతే 2023లో వచ్చే 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడంలోనూ విఫలం చెందాల్సి వస్తుంది.  ప్రతిపక్షంగా కూడా ఆ పార్టీ ఉనికిపై సందేహాలు వ్యక్తమవుతాయి కాబట్టి ఆ పార్టీకి గెలుపు చాలా ముఖ్యం. బీజేపీకి కూడా కర్నాటక విజయం అంతే ముఖ్యం. బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్‌కు పెద్ద లాభం. అందుకే గెలిచేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌ను గెలుపు కోసం ఆసరాగా చేసుకుంటోంది. ఇక్కడ బీజేపీ గెలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2023లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి నల్లేరు మీద నడక అవుతుంది. ఇతర పార్టీలకు మెజారిటీ రాకపోతే గతంలో  జరిగినట్టు మళ్లీ తామే కింగ్ అవుతామని జేడీ(ఎస్) ఆశగా ఉంది. కర్నాటక నాయకులకు గొప్ప ఆర్థిక వనరులు ఉన్నందున కాంగ్రెస్ అధిక శక్తితో కూడిన ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీకి16 శాతం ఉన్న ముస్లిం ఓట్లు ప్లస్​పాయింట్. బీజేపీలో టిక్కెట్ రాకపోవడంతో కొందరు పెద్ద నేతలు కాంగ్రెస్‌కు రావడం ఆ పార్టీకి కొంత మేలు చేసింది. కర్నాటక బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రధాన పార్టీలుగా ఉన్న రాష్ట్రం, అలాంటి స్టేట్​లో కాంగ్రెస్ మనుగడ సాగిస్తోంది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. నరేంద్ర మోడీ ఇమేజ్ తనకు సాయపడుతుందని బీజేపీ భావిస్తోంది. నరేంద్ర మోడీ కర్నాటకలో పర్యటిస్తున్నందున ర్యాలీలు, సభలకు వచ్చే జనాలు ఓట్లుగా మారతారని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం 224 సీట్లలో లింగాయత్‌లకు 70 టికెట్లు, కొత్తగా 60 మందికి టికెట్లు ఇచ్చిన బీజేపీ.. ఈ వ్యూహం ఎన్నికల్లో విజయం సాధించి అధికార వ్యతిరేక పోరాటం చేస్తుందని భావిస్తున్నది. దేవెగౌడ పార్టీ పూర్తిగా వొక్కలిగ కులానికి చెందిన వారిపై ఆధారపడి విజయం ఆశిస్తున్నది. 1999 నుంచి వొక్కలిగలు దేవెగౌడకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆయన పార్టీకి వారివి పెద్ద ఎత్తున ఓట్లు వస్తున్నాయి.  బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కు గానీ మెజారిటీ రాదని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది దేవెగౌడ ఆశ.

బూత్​స్థాయి నుంచి

కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తుండగా..  బీజేపీ బూత్ ​స్థాయి నుంచి పోల్​మేనేజ్​మెంట్​వ్యూహాన్ని అమలు పరుస్తున్నది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా14 మంది సభ్యులతో కూడిన ఎన్నికల నిర్వహణ కమిటీతోపాటు.. ప్రావీన్స్​స్థాయిలో 32 కమిటీలను ఏర్పాటు చేశారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయాలను వివరించడంతోపాటు ప్రతి ఓటరును కలిసి ప్రధాని మోడీ పాలన తీరును చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు ఇరు పార్టీల అగ్రనాయకులతోపాటు స్టార్​ క్యాంపెయినర్లతో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్​గాంధీ, ప్రియాంకా, కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం చేయగా.. బీజేపీ నుంచి ప్రధాని మోడీ, అమిత్​షా, నడ్డా, కేంద్ర మంత్రులు, పలువురు స్టార్​ క్యాంపెయినర్లు ఓటర్లను కలిశారు. 40 శాతం కమీషన్​ సర్కారు అని కాంగ్రెస్​ బీజేపీని నిలదీస్తుండగా.. బీజేపీ బజరంగ్​దళ్​నినాదాన్ని విస్తృతం చేస్తూ.. కాంగ్రెస్​ను ఇరకాటంలో పెట్టి ఓటర్లకు దగ్గరవుతున్నది. బీజేపీకి విజయం అంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో లేదా దేవెగౌడ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో కాగా... కాంగ్రెస్‌కి విజయం అంటే సొంత మెజారిటీ రావాలి. మే13న కర్నాటక ఫలితాలు వెలువడనుండగా, ఇక్కడి ప్రజల తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.


ఎన్నికల్లో మఠాల పాత్ర

రాజకీయ పార్టీలు కుల ప్రాతిపదికన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రయత్నిస్తాయి. కర్నాటకలో శతాబ్దాలుగా బలమైన- మత ఉద్యమం ఉంది. కర్నాటకలో ఉన్న మఠాలు మరే ఇతర రాష్ట్రంలో లేవు. కొన్ని మఠాలు వందేండ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. అనేక కులాలకు వారి సొంత మఠాలు ఉన్నాయి. మఠాలు మతపరమైన పనిలో మాత్రమే కాకుండా, విద్య, ఆహారం అందించడంలో కూడా విస్తరించాయి, ప్రాచుర్యం పొందాయి. మఠాలు రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనేది సాధారణ నియమం. కానీ వాస్తవానికి, మఠాలు తమ ప్రతిష్ట, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నందున రాజకీయాల్లో నిశ్శబ్దంగా పాల్గొంటాయి. కర్నాటకలో 300కి పైగా ముఖ్యమైన లింగాయత్ మఠాలు ఉన్నాయి. ఇతర కులాల్లో కూడా మఠాలు ఉన్నా, ఇంత పెద్ద సంఖ్యలో లేవు. కర్నాటకలో దాదాపు 16% ఉన్న లింగాయత్ ఓట్లు చాలా ముఖ్యమైనవి. అవి కేంద్రీకృతమై ఉన్నాయి. వారు కనీసం 70 ఎమ్మెల్యే సీట్లను తమ ఆధీనంలో ఉంచుకుంటారు. బీజేపీకి చెందిన గత ముగ్గురు ముఖ్యమంత్రులు లింగాయత్‌లు. దేవెగౌడ ఒక వొక్కలిగ. లింగాయత్‌లు ఉన్నత విద్యావంతులు, ధనవంతులు. వారు తమ ప్రయోజనాలను చూసుకొని జాగ్రత్తగా ఓటు వేస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా లింగాయత్ కావడంతో లింగాయత్‌లు తమకు అనుకూలంగా ఉంటారని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసింది. లింగాయత్‌లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ముఖ్యమంత్రి తన పీఠాన్ని కోల్పోతారని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ గెలిస్తే లింగాయత్ యేతర ముఖ్యమంత్రి అవుతారని లింగాయత్ లకు పూర్తిగా తెలుసు. లింగాయత్ మఠాలు కూడా గెలుపు వైపు ఉండేందుకు ఇష్టపడుతున్నాయి.

- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్