కర్నాటక చిన్నారికి మంత్రి దామోదర అండ..నిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉచిత గుండె ఆపరేషన్

కర్నాటక చిన్నారికి మంత్రి దామోదర అండ..నిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉచిత గుండె ఆపరేషన్
  • మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి పేరెంట్స్ 

హైదరాబాద్, వెలుగు: గుండె జబ్బుతో బాధపడుతున్న కర్నాటకకు చెందిన 8 ఏండ్ల చిన్నారికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆపద్బాంధవుడిగా నిలిచారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు ఉచితంగా గుండె ఆపరేషన్​ చేయించి ఔదార్యం చాటుకున్నారు. కర్నాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్‌‌లోని మలక్‌‌పేటలో నివసిస్తూ, స్థానిక హోటల్‌‌లో పనిచేస్తున్నారు. వారి కుమార్తె ఐశ్వర్య తరచూ అనారోగ్యానికి గురవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా, ఆమెకు గుండె జబ్బు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. 

శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాపాయమని, దీనికి కనీసం 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. కర్నాటకకు చెందిన కుటుంబం కావడంతో వారికి ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు లేక ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రకాంత్ దంపతులు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి చిన్నారి ఆరోగ్య సమస్యను వివరించారు. వారి ఆవేదనకు చలించిన మంత్రి.. ఐశ్వర్యను నిమ్స్‌‌లో అడ్మిట్ చేయించి, ఉచితంగా ట్రీట్​మెంట్ అందించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఆపరేషన్‌‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

ఈ నెల 4న డాక్టర్ గోపాల్, డాక్టర్ ప్రవీణ్ నేతృత్వంలోని బృందం చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. పూర్తిగా కోలుకున్న ఐశ్వర్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి దామోదర రాజనర్సింహను చిన్నారితో పాటు కలిసిన చంద్రకాంత్ దంపతులు, తమ కుమార్తె ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారిని ఆప్యాయంగా పలకరించి, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.