ఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ సడలించం

ఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ సడలించం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. మే 3 వరకు ఈ లాక్డౌన్ అమలులో ఉండనుంది. అయితే ప్రజావసరాల దృష్ట్యా ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం సూచించింది. కానీ, కర్ణాటక ప్రభుత్వం మాత్రం సడలింపుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 తర్వాత ద్విచక్ర వాహనాలు మరియు ఐటీ కంపెనీలు పనిచేయడానికి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. శనివారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిర్ణయం ప్రకారం ద్విచక్ర వాహనాల నిషేధం కొనసాగుతుందని సీఎం కార్యాలయ అధికారి తెలిపారు. అయితే ఐటీ మరియు బయోటెక్నాలజీ పరిశ్రమలలో కొన్న అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ రంగాలకు చెందిన ఉద్యోగులు కొందరు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆయన సూచించారు.

కాగా.. శనివారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏప్రిల్ 20 తర్వాత ద్విచక్ర వాహనాలకు మరియు నిర్మాణరంగ పనులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ మినహాయింపును క్యాన్సిల్ చేస్తున్నట్లు సీఎం ఆఫీస్ ప్రకటించింది.

శనివారం ఉదయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రులతో సమావేశం నిర్వహించారు. కరోనా అదుపులో ఉన్న ప్రాంతాలలో మరియు అదుపులో లేని ప్రాంతాలలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారితో ఆయన చర్చించారు. అయితే లాక్డౌన్ వల్ల ప్రజలు చికాకు పడుతున్నారని ముఖ్యమంత్రి గుర్తించారు. లాక్డౌన్ ఉల్లంఘనల కేసులు పెరుగుతున్నాయి. అయినా సరే ఏప్రిల్ 20 వరకు లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన అన్నారు. కరోనా కేసులు ఎక్కువగా గుర్తించబడిన ప్రదేశాలలో ప్రజలు తమ ఇళ్ళ నుండి కూడా బయటకురాకూడదని ఆయన అన్నారు. ఆ ప్రాంతాలలోని వారికి అవసరమైన వస్తువులు హోం డెలివరీ చేస్తామని ఆయన అన్నారు. ఇక నుంచి అనుమతి పాసులు కూడా ఎక్కువ సంఖ్యలో జారీ చేయమని ఆయన తెలిపారు. అయితే ఏప్రిల్ 20 తరువాత కరోనా నియంత్రణలో ఉన్న మండలాల్లో లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని ఎనిమిది హాట్‌స్పాట్ జిల్లాల్లు గుర్తించబడ్డాయి. ఆ జిల్లాల్లో ఎటువంటి సడలింపు ఉండదని సీఎం స్పష్టం చేశారు. వాటిలో బెంగళూరు అర్బన్, మైసూరు, బెలగావి, దక్షిణ కన్నడ, బీదర్, కలబురగి, బాగల్‌కోట్ మరియు ధార్వాడ్లతో సహా క్లస్టర్‌లు ఉన్న జిల్లాలు ఉన్నాయి.
శనివారం నాటికి రాష్ట్రంలో 384 పాజిటివ్ కేసులు, 14 మరణాలు, 104 రికవరీలు ఉన్నాయి.