మాజీ జేడీఎస్ ఎమ్మెల్యే ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. అత్యాచారం కేసులో తన జైలు శిక్షను నిలిపివేయాలని ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు తన జైలు శిక్షను నిలిపివేయాలని ప్రజ్వల్ రేవణ్ణ వేసిన పిటిషన్ ను బుధవారం( డిసెంబర్3) కోర్టు తోసిపుచ్చింది.
అత్యాచారం కేసులో జైలు శిక్ష, తనను దోషిగా నిర్దారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రేవణ్ణ దాఖలు పిటిషన్లను విచారించిన జస్టిస్ కేఎస్ ముదగలత్, వెంకటేష్ నాయక్ లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజ్వల్ రేవణ్ణ పిటిషన్ ను తోసిపుచ్చింది. అయితే ఈ కేసులో రేవణ్ణకు జీవిత ఖైదు విధించాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పై హైకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉండగా తన శిక్షను నిలిపివేయాలని లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రేవణ్ణ కోర్టును కోరగా కోర్టు తిరస్కరించింది.
నిందితుడు దోషిగా నిర్ధారించబడిన తర్వాత జైలు శిక్షను నిలిపివేయలేమని ధర్మాసనం తెలిపింది. రేవణ్ణ జైలు శిక్షను నిలిపివేస్తే పెండింగ్‌లో ఉన్న సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
2024లో ప్రజ్వల్ రేవణ్ణపై మూడు అత్యాచార కేసులు, లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యాయి. అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులను చిత్రీకరించి 2 900 కి పైగా వీడియోలు సోషల్ మీడియాతో సహా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిన తర్వాత ఈ కేసులు నమోదు చేశారు.తనపై అనేకమార్లు అత్యాచారం చేశాడంటూ ఆయన ఇంట్లో పనిచేస్తున్న మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2025 ఆగస్టులో ట్రయల్ కోర్టు ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చింది. 2024లో అరెస్టు అయిన రేవణ్ణపై క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. అప్పటినుంచి జైలులోనే ఉన్నాడు.
