బెంగళూర్: దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందూ మత సంస్థలు, ధార్మిక దానాల (ముజ్రాయ్) శాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేవాలయాలలోని విరాళాల పెట్టెలు, లెక్కింపు ప్రక్రియలోని ప్రతి అంశంపై నిరంతర సీసీటీవీ పర్యవేక్షణను అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు సీఎం డీకే శివకుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా బెళగావిలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందూ మత సంస్థలు, ధార్మిక దానాల శాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని దేవాలయాలలో గర్భగుడి సమీపంలో ఉంచిన విరాళాల పెట్టెలను, లెక్కింపు ప్రక్రియలోని ప్రతి దశను సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షిస్తాయన్నారు. ఆలయ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచేందుకు జిల్లా ఎస్పీ, డిప్యూటీ కమిషనర్ లేదా తాలూకా స్థాయి అధికారుల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
►ALSO READ | భవిష్యత్తు హైడ్రోజన్ ఇంధనానిదే.. దేశంలోని 10 రూట్లలో ట్రైల్స్ షురూ: నితిన్ గడ్కరీ
ఆలయాల్లోని అన్ని ప్రాంతాలను, ముఖ్యంగా డబ్బు వసూలు చేసి లెక్కించే ప్రదేశాలను కూడా కవర్ చేస్తూ సీసీటీవీ కెమెరాలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు. అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ యావత్ హిందూ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు.
