ప్రజాస్వామ్య హక్కును చాటిన బర్రెలక్క

ప్రజాస్వామ్య హక్కును చాటిన బర్రెలక్క

పేదరికం పెద్ద జబ్బేమీ కాదు.. అన్ని జబ్బులకు పరిష్కారం చూపే తాత్విక పునాది. పేదరికంతో ప్రజాస్వామ్య వ్యవస్థల మీద పెను ప్రభావం చూపవచ్చు అని ముక్కుపచ్చలారని బర్రెలక్క  కర్నె శీరీష నిరూపించింది. దశాబ్దాల అనుభవాల దొంతరపొత్తు చెప్పే బీసీ నాయకులు శిరీషను చూసి సిగ్గు పడాలి. బీసీల రాజ్యాధికారం చందాల దందాల కాడనే ఆగిపోతే...వారి నాయకులు చెల్లని రూపాయి అవుతారు. ఆకలి  బాధలు మనిషిని ఆలోచింపజేస్తాయి. దానికి ఉదాహరణ.. మార్క్స్, లెనిన్, అంబేద్కర్, కాన్షీరాంలే. అయితే, అంత  ఫిలాసఫీ తెలియని, నిలువ నీడలేని, కడుపునిండా తినడానికి తిండిలేని ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నించింది.  పోటీ పరీక్షల పేపర్స్ లీక్ కావటంతో ఉద్యోగ ప్రయత్నం విఫలమైంది. భావోద్వేగంతో  కన్నీరుమున్నీరయింది. తీవ్ర అంతర్మథనం చెందింది.  బతుకుదెరువు కోసం బర్రెలను కాసింది. దాంతో వచ్చే కొంచెం ఆదాయంతోనే  పొట్ట నింపుకొంది. బర్రెలు కాసేటప్పుడు 30 సెకండ్ల నిడివి గల వీడియోతో  విద్యావంతురాలైన బర్రెలక్క ప్రపంచానికి పరిచయమైంది. నిరుద్యోగులకే కాకుండా మొత్తం సమాజానికి తనను తాను పరిచయం చేసుకుంది. ఆ గుర్తింపే ఎన్నికల్లో  పోటీ చేసే తెగింపుగా మారింది. 

ధైర్యమే ఆయుధంగా ముందడుగు

 ప్రజాస్వామ్య హక్కును బర్రెలక్క తన లక్కుగా మార్చుకుంది. మహబూనగర్ జిల్లా కొల్లాపూర్​లో పోటీ చేసి కోట్ల డబ్బుతో  గెలుద్దాం అనుకున్న నాయకులను గడగడలాడిస్తున్నది. గెలిచినా, ఓడినా, శభాష్  శిరీషా అనిపించుకుంటూ..  నిజమైన ప్రజాస్వామికుల మనసులను గెలుచుకుంటుంది. నీతి, నిజాయతీలు  సామ్రాజ్యవాదం కంటే పదునైన కత్తులు అని బర్రెలక్క పట్టుదల ఎన్నికల్లో నిరూపించబోతున్నది. మల్లాడి కృష్ణారావు లాంటి ప్రముఖులు బర్రెలక్కకు ఆర్థికంగా అండగా నిలబడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమె మీద పెద్ద కథనం రాసి ప్రపంచ దృష్టికి తెచ్చింది. ప్రశంసలతోపాటు కొన్ని వేల బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. బర్రెలక్క తమ్ముడి మీద అప్రజాస్వామిక వాదులు దాడి చేసి భయపెట్టారు.  శిరీష కుటుంబానికి కావాల్సినంత డబ్బు ఇస్తామని,  ప్రచారం ఆపమన్నారు. కానీ, మొక్కవోని ధైర్యంతో బర్రెలక్క దేనికీ లొంగకుండా ముందడుగు వేసింది.

ఎన్నికల బరిలో తగ్గేదేలే

జనంలోనే ఉండి ఎన్నికల బరిలో ఉన్న శిరీషకు రక్షణ లేకుండా పోయింది. ఆమె ఎన్నికల్లో  పోటీ చెయ్యాలనే ఆలోచన నుంచి వెనక్కి తగ్గకుండా ఉండటాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎన్నికలు అంటే డబ్బు, మందీమార్బలం, మద్యం అనే చందంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో  నేడు శిరీష  పోటీ  సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  బలంగా ప్రశ్నిస్తాం, పార్టీపెట్టి ఉద్ధరిస్తామని బీసీలలో నమ్మకం కోల్పోయిన బ్యాచ్ అంటే నమ్మేవాళ్లు లేరు. మూడు దశాబ్దాల చరిత్ర చెప్పేవారు.. వంద నుంచి ఐదువందల మంది ఎన్నికల్లో  పోటీ చేస్తే 30 రోజుల్లో బీసీల అంశం హైలైట్ అవుతుంది. మాటలు కాదు. శిరీషలాంటి చేతలు కావాలి.

ధనస్వామ్య రాజకీయాలు

ఎన్నికల కమిషన్ తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. 40 లక్షలు, ఎంపీ అభ్యర్థి అయితే రూ.70 లక్షలు ఖర్చు పెట్టాలనే నిబంధన కమిషన్ చిత్తశుద్ధితో  అమలు చేస్తుందనే నమ్మకం ప్రజాస్వామ్యవాదులకు నేడు లేదంటే అతిశయోక్తి కాదు.  ఆ నిబంధన ఖచ్చితంగా పాటిస్తే  బర్రెలక్క శిరీషని ఇంటికి ఇంతని వేసుకొని  గెలిపించడం ఖాయం. కానీ, ఆ ఛాయలు మచ్చుకైనా కనబడటం లేదు. కోట్లాది రూపాయలు నాయకులు ఖర్చు చేస్తున్నారు. వ్యాపారం, రాజకీయం  కలిసిపోయి రాజకీయాలను ధనస్వామ్యంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో శిరీషను అందరూ కలిసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.  రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈడీ, ఎలక్షన్ కమిషన్​లతోపాటు  ఐటీశాఖను పాలకులు ప్రత్యర్థులపై  ప్రయోగిస్తున్నారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి మారిన వివేక్ వెంకటస్వామి కుటుంబంపై కక్ష సాధింపుగా ఐటీ రైడ్స్ చేయించిన ఏలినవారు చట్టం తనపని తను చేస్తున్నట్లు సాకులు చెబుతుంటే జనం నమ్మే స్థితిలో లేరు.

- సాధం వెంకట్​,  సీనియర్​ జర్నలిస్ట్​