కార్తీక మాసం అంటే చంద్రుడు... పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండేటటువంటి మాసమే కార్తీకము మనేది కృతిక అనే పదం నుంచి వచ్చింది. కార్తీకమాసమంతా కూడా నక్షత్రాలకు అధిపతిగా ఉన్నటువంటి కార్తికేయుడు అధిక శక్తిని కలిగి ఉంటాడని పురాణాలు ద్వారా తెలుస్తోంది. అందుకే కార్తీక మాసం కార్తీక దామోదరునికి ఎంతో ప్రీతికరమైనది. కార్తీక మాసం అంతా ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది.ఇక సోమవారానికి ఉండే విశిష్టత అంతా ఇంతాకాదు. కార్తీక సోమవారం ( 2025 అక్టోబర్ 27)న శివాలయాల్లో దీపారాధన.. అభిషేకాలు చేస్తే అశ్వమేథయాగంచేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో చేసే దానాలకు.. పూజలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో సోమవారం ఉపవాసం ఆచరించి సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయంలో నక్షత్ర దర్శనం చేసిన తరువాత దీపారాధన చేసి భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. కొంతమంది సోమవారం అంతా ఉపవాస దీక్షను పాటిస్తారు. ఎలా చేసినా భక్తితో .. నమ్మకంతో చేసిన వారికి.. శివానుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది.
కార్తీక సోమవారం రోజు చేసే స్నానం, దానం, జపం వంటివి అశ్వమేధ యాగం చేసినంత అద్భుత ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు అనేక రకాలుగా ఉంటాయి. అవేమిటంటే.. ఒంటి పూట భోజనం, రాత్రిపూట భోజనం, ఛాయానక్త భోజనం, తిలదానం, పూర్తి ఉపవాసం ఇలా ఉపవాసాన్ని ఆచరిస్తారు. తిల దానం అంటే నువ్వులు దానం చేస్తారు. అలాగే పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్లు ఒంటిపూట భోజనం చేయవచ్చు. ఈ కార్తీక మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరిస్తారు.
కార్తీక సోమవారం పూజా విధానం
కార్తీకమాసం నెలరోజులు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్రస్నానం చేయాలి. నెల రోజులు కుదరని వారు కనీసం సోమవారం రోజైనా చేయాలి. అవకాశం ఉంటే నదీస్నానం చేస్తే మరీ మంచిది. ఎందుకంటే ఈ నెల రోజులు.. నదీతీరాల్లో బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వరులు అనే త్రిమూర్తులు కొలువై ఉంటారు.
తరువాత ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్లి పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. వేదాలు ప్రకారం మంత్రాలతో చేయకపోయినా... చెంబుడు నీళ్లను శివలింగానికిఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని.. అంటూ పోసిన సరిపోతుంది. ఇతర శివ మంత్రాలను పఠించాలి . స్వామి వారికి బిల్వ దళాలు సమర్పించాలి. తరువాత అవకాశం ఉన్నవారు ఉండగలిగిన వాళ్లు ఆ రోజున ఉపవాసం ఆచరించాలి.
రోజంతా పరమేశ్వరుని ధ్యానిస్తూ గడపాలి. ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి...దీపారాధన చేసి నక్షత్రదర్శనం తరువాత ఉండలేని వారు ఉపవాస దీక్షను విరమించాలి. ఉపవాసం కొనసాగించే వారు మంచంపై పడుకోరాదు. నేలపైనే పడుకోవాలి. జాగారణ చేస్తే మరీ మంచిదని పండితులు చెబుతున్నారు.
కార్తీక సోమవారం వత్రం .. పూజ.. ఉపవాసం.. శివాలయదర్శనం చేసిన వారికి అశ్వమేథయాగం చేసిన ప్రతిఫలమే కాకుండా.. సకల పాపాలు పోయి.. కైలాస ప్రవేశం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు.. అష్ట ఐశ్వర్వాలు కలిగి.. వివాహం కాని స్త్రీలకు మంచి భర్త లభిస్తాడని పండితులు చెబుతున్నారు. . ఇక ఈరోజున కార్తీక సోమవారం కథ విన్నా, చదివినా విశేషమైన పుణ్య ఫలం దక్కుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
