కిక్కిరిసిన రాజన్న, మల్లన్న క్షేత్రాలు

కిక్కిరిసిన రాజన్న, మల్లన్న క్షేత్రాలు

 శ్రీశైలం/వేములవాడ, వెలుగు:  శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జునస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో వేలాదిగా తరలివచ్చారు. శ్రీశైలంలో దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. 

ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం, ఉత్తర శివ మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయ అభిషేకాలు నిలిపి వేశారు. సాయంత్రం ప్రధానాలయం ఈశాన్య భాగంలోని ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. వేములవాడలో తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించారు.