కార్తీక పున్నమి వేళ జ‌‌న‌‌సంద్రమైన అయోధ్య

కార్తీక పున్నమి వేళ జ‌‌న‌‌సంద్రమైన అయోధ్య
  • సరయూ నదిలో ల‌‌క్షలాది మంది పుణ్యస్నానాలు
  • జై శ్రీ‌‌రామ్ నినాదాల‌‌తో మారుమోగిన టెంపుల్ టౌన్
  • వేలాది మందితో బందోబస్తు ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం

అయోధ్య నుంచి వెలుగు ప్రతినిధి: టెంపుల్ టౌన్ అయోధ్య జనసంద్రమైంది. జై శ్రీ‌‌రామ్ నినాదాల‌‌తో మారుమోగింది. ఆలయాలన్నీ కిటకిటలాడాయి. కార్తీక పున్నమి సంద‌‌ర్భంగా లక్షలాది మంది భ‌‌క్తులు తరలివ‌‌చ్చారు. స‌‌ర‌‌యూ న‌‌దిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున భక్తులు స‌‌ర‌‌యూ నదిలో స్నానం చేస్తారు. అయితే రామ మందిరం నిర్మాణానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గతంతో పోలిస్తే భ‌‌క్తుల తాకిడి భారీగా పెరిగిందని పోలీసు అధికారులు చెప్పారు.

ప‌‌టిష్ట భద్రత

రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం.. అత్యంత సున్నితమైన అంశం కావడంతో తీర్పు త‌‌ర్వాత గొడవలు జరగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయోధ్య పరిస‌‌ర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛ‌‌నీయ సంఘ‌‌ట‌‌న‌‌లు జరగకుండా ప‌‌టిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆలయానికి కిలో మీటర్ దూరంలోనే సెల్ ఫోన్లు, కెమెరాలను పోలీసులు పూర్తిగా నిషేధించారు. దాదాపు 5 వేల మందికిపైగా పోలీసులను బందోబస్తులో ఉంచారు. ఉన్నతాధికారులు హెలికాప్టర్ ద్వారా భద్రత ఏర్పాట్లను ప‌‌ర్యవేక్షించారు. స‌‌రయూ నదిలో ఎన్డీఆర్ఎఫ్ బ‌‌ల‌‌గాలు ప్రత్యేక ర‌‌క్షణ చ‌‌ర్యలు చేప‌‌ట్టాయి. ఆర్ఏఎఫ్‌‌, యూపీ ఉగ్రవాద వ్యతిరేక ద‌‌ళం, యూపీ సివిల్ పోలీసులు కూడా విధుల్లో ఉన్నారు. కేంద్ర పారామిల‌‌ట‌‌రీ పోలీసుల సాయంతో యూపీ పోలీసులు ప‌‌రిస్థితిని ఎప్పటిక‌‌ప్పుడు స‌‌మీక్షిస్తున్నారు. అయోధ్య న‌‌గ‌‌రంలో మ‌‌ళ్లీ సాధార‌‌ణ ప‌‌రిస్థితులు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

గుప్తార్ ఘాట్ లో దీపోత్సవం

శ్రీరాముడు అవతారం చాలించిన ప్రాంతంగా భక్తులు విశ్వసించే గుప్తార్ ఘాట్ లో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. స్థానికులు, భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. రామచంద్రుడు నిర్యాణమైన ప్రాంతంలో ఓం కారం, స్వస్తిక్ ఆకృతుల్లో వేలాది దీపాలను వెలిగించారు. తర్వాత నిర్వహించిన హారతి కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో రామ్​లల్లాను దర్శించుకోవడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టిందని భక్తులు చెప్పారు.

నాపేరు రాందాస్. 10 ఏళ్లుగా సరయూ నదిలో పడవ నడుపుతున్నా. ఇక్కడికి వచ్చే భక్తులపైనే మా జీవితం ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి సరయూ నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. ఇంతమంది భక్తుల్ని చూడడం సంతోషంగా ఉంది. ‑ రాందాస్.

మాది ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురం. మేం 10 మంది వచ్చాం. ఉత్తరాదిన ఎక్కడ జాతర జరిగినా బొమ్మలు, ప్లాస్టిక్ పూలతో తయారు చేసిన డెకరేషన్ సామాను అమ్ముతుంటాం. నేను తీసుకొచ్చిన వస్తువులన్నీ అమ్ముడు బోయాయి. మేం ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలోనే భక్తులు వచ్చారు.‑ డెకరేషన్ బొమ్మలు అమ్ముకునే కృష్ణప్ప

Kartik Purnima: Devotees take holy dip amid high security in Ayodhya