యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్టలో కార్తీక మాస  పూజలు షురూ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాస సందడి  మొదలైంది. ఈ పూజలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. మంగళవారం సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. కొండ కింద వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించి సత్యదేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు వీలుగా కొండపైన ప్రధానాలయం ఎదుట, శివాలయం ఎదుట, విష్ణుపుష్కరిణి వద్ద, కొండ కింద లక్ష్మీపుష్కరిణి ఎదుట, సత్యనారాయణస్వామి వ్రత మండపం వద్ద ‘కార్తీక దీపారాధన’ పేరుతో ప్రత్యేక స్టాల్స్​ఏర్పాట్లు చేశారు. 

గుట్టలో రోజుకు ఆరు బ్యాచుల్లో వ్రతాలు 

కార్తీకమాసంలో అన్నవరం తర్వాత ఎక్కువగా యాదగిరిగుట్టలోనే భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించుకుంటారు.భక్తుల తాకిడికి అనుగుణంగా కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాళ్లలో వ్రతాలు నిర్వహించుకోవడానికి సదుపాయాలు కల్పించారు. ప్రతిరోజు ఆరు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు. రూ.800 వ్రత టికెట్ పై పూజా సామగ్రి, పాత్ర సామగ్రిని అందజేస్తున్నారు. మంగళవారం నుంచి డిసెంబర్ 12 వరకు ప్రతిరోజు ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం ఆరు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహిస్తారు. 

అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కూడా మంగళవారం నుంచి కార్తీక మాసం ముగిసే వరకు రోజుకు ఐదు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున ఐదు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు.