
వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత టెస్ట్ జట్టును గురువారం (సెప్టెంబర్ 25) ప్రకటించారు. 15 మందితో స్క్వాడ్ లో ఊహించినట్టుగానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ కు చోటు దక్కలేదు. ఈ వెటరన్ బ్యాటర్ కు జట్టులో ఎంపిక చేయకపోవడానికి కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 8 ఏళ్ళ తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులోకి వచ్చిన కరుణ్ ఆకట్టుకోలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 25.62 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. కరుణ్ నాయర్ అవసరం జట్టుకు లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు.
అగార్కర్ మాట్లాడుతూ.. " ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కరుణ్ నాయర్ నుండి మేము చాలా ఆశించాము. కానీ అతను పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క హాఫ్ సెంచరీతోనే సరిపెట్టుకున్నాడు. సిరీస్ లో ఒక్క ఇన్నింగ్స్ ఆడితే సరిపోదు. అందుకే కరుణ్ స్థానంలో పడికల్ కు అవకాశం ఇవ్వాలని భావించాం. పడికల్ నిలకడగా రాణిస్తున్నాడు. అతను జట్టులో ఎంపికవ్వడానికి అర్హుడు. అందరికీ అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకున్నా అది సాధ్యం కాదు". అని అగార్కర్ విలేకరుల సమావేశంలో అన్నారు. అగార్కర్ మాటలను బట్టి చూస్తుంటే టీమిండియా టెస్ట్ జట్టులో ఇక కరుణ్ నాయర్ ఎంపికవ్వడం కష్టంగానే కనిపిస్తుంది.
ఎందుకంటే ఫస్ట క్లాస్ క్రికెట్లో నాయర్ పరుగుల వరద పారించాడు. అలాగే ఐపీఎల్లో ఢిల్లీ తరుఫున బాగానే రాణించాడు. ఇదే సమయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో జట్టులో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్లు లేకుండా అయిపోంది. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్‌కు మొత్తం యువ జట్టే కాకుండా కొందరు అనుభవజ్ఞులను కూడా పంపించాలని బీసీసీఐ భావించింది. ఈ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఇంగ్లాండ్ సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అయితే వచ్చిన అవకాశాలను నాయర్ చేజార్చుకున్నాడు.
అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గిల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్ దూరం కావడంతో వైస్ కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు అప్పగించారు.