
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. సుపరిపాలన, మత సామరస్యం ఉండాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం, గౌరవం దక్కాయన్నారు. ఇంకా ఎంతో మంది నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
కాగా, టీడీపీలో చేరిన వారిలో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ పంచాయతీ రాజ్ ఈఈ కొండ్రా కుమార్, పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హరీశ్, రామగిరి అంకుశ్, వర్షిణి లింగారావు తదితరులు ఉన్నారు. వీరికి కాసాని టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.