
వారణాసి (యూపీ): వారణసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంలో ఆగస్టు 11 నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించనున్నట్టు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. గుడి పరిసరాలను పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా, పర్యావరణహితంగా మార్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇక నుంచి భక్తులు ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, పాలు లేదా ఇతర పూజ సామగ్రి కోసం ఉపయోగించే ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను ఆలయ ప్రాంగణంలోకి తీసుకురాకూడదు. ఈ నియమాన్ని అమలు చేయడానికి ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద ప్లాస్టిక్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశ్వభూషణ్ మిశ్రా మాట్లాడుతూ.. "కాశీ విశ్వనాథ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ఒక ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఈ చర్య ద్వారా ఆలయాన్ని కాలుష్య రహితంగా మార్చి, భవిష్యత్ తరాల కోసం సంరక్షించడమే మా లక్ష్యం" అని తెలిపారు.