కేసీఆర్‌‌ బీజేపీతో కలవలేదనే కవిత అరెస్ట్ : హరీశ్​రావు

కేసీఆర్‌‌ బీజేపీతో కలవలేదనే కవిత అరెస్ట్ : హరీశ్​రావు
  •  రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌
  • 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు ఎండినా పట్టించుకోవట్లే

మెదక్, వెలుగు: కేసీఆర్ బీజేపీతో కలవలేదనే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్​ చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు​ఆరోపించారు.  మంగళవారం మెదక్‌లోని బీఆర్ఎస్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు.  రాహుల్​గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనను విమర్శిస్తుండగా, కాంగ్రెస్ ​సీఎం అయిన రేవంత్​ రెడ్డి ప్రధాని మోదీని సమర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​అరెస్ట్​ అక్రమమని రాహుల్​ గాంధీ అంటే, బీఆర్ఎస్ ​ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ సక్రమమని రేవంత్​రెడ్డి అంటున్నారని మండిపడ్డారు.

 సాగునీరందక, కరెంట్​సరిగా రాక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ఎండుతున్న పంటలను చూడలేక నిప్పు పెడుతున్నారని, నాలుగు నెలల కాంగ్రెస్​ పాలనలో రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. అయినా ప్రభుత్వానికి కనికరం లేదని, సీఎం రేవంత్ రెడ్డికి ఒక్క రైతును కూడా ఓదార్చే ఓపిక లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధించడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు.

 బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్​ ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. రెండు లక్షలు రుణ మాఫీ చేస్తామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసగించిన కాంగ్రెస్​ పార్టీకి పార్లమెంట్​ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే వారు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే  ప్రశ్నించే గొంతుకగా ప్రజల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.   ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్​జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్​రెడ్డి, బీఆర్ఎస్​ మెదక్‌ పార్లమెంట్‌  అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్​హుసేన్​, ఎర్రోళ్ల శ్రీనివాస్​, తిరుపతిరెడ్డి తదితరులు 
పాల్గొన్నారు.