హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతోందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ఒక్కో స్కూల్ కు 146 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని, మొత్తం 72 స్కూళ్లకుగానూ సగానికి పైగా మేఘా, కేఎంవీ అనే సంస్థలకే ఇచ్చారని విమర్శించారు.
వాళ్లు 5 శాతం ఎక్సెస్ కోట్ చేయటంతో ప్రభుత్వంపై 6 వందల కోట్లకు పైగా భారం పడుతుందన్నారు. “72 స్కూళ్ల కోసం దాదాపు 11 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారు. కానీ రెండున్నరేళ్లలో ఈ స్కూల్స్ నిర్మాణం పూర్తి అవ్వడం సాధ్యం కాదు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి కనీసం మూడేళ్లకు పైగా పడుతుంది. రెవెన్యూ డివిజన్ లో స్కూల్ నిర్మిస్తే మళ్లీ విద్యార్థులు వెళ్లేందుకు బస్సులు పెట్టాలి. ఆ బస్సులను కూడా మీరు మేఘా సంస్థకే ఇస్తారని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ గ్రామాల్లోకి రెడ్ కార్పేట్ వేసి ప్రైవేట్ స్కూళ్లను ఆహ్వానిస్తున్నారు” అని ఆరోపించారు. టెండర్లలో జరిగిన గోల్ మాల్ పై ముఖ్యమంత్రి కచ్చితంగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.
