లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత

లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
  • లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నయ్
  • ఇండో స్పిరిట్​లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు లక్ష జీతం 
  • బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో ఈడీ వాదనలు 
  • ముగిసిన విచారణ.. మే 6న తీర్పు 

న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్ స్కామ్ ప్రీప్లాన్డ్​గా జరిగిందని ట్రయల్ కోర్టుకు ఈడీ తెలిపింది. ‘‘ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నయ్. వాటిని కోర్టుకు అందజేసినం. కవిత ఆధారాలను ధ్వంసం చేయడమే కాకుండా అప్రూవర్లను బెదిరించారు. అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు” అని కోరింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై బుధవారం మూడో రోజు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. 

ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ దాదాపు గంటన్నర పాటు వాదనలు వినిపించారు. ‘‘ లిక్కర్ పాలసీలో క్విడ్ ప్రోకో జరిగింది. ముడుపులు తీసుకుని కమీషన్ ను 12 శాతానికి పెంచారు. దీంతో దాదాపు రూ.338 కోట్లు అక్రమంగా సంపాదించారు. లిక్కర్ వ్యాపారంలో మేజర్ హోల్ సెల్లర్ గా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీ రూ.192 కోట్లు లాభం పొందింది. ఈ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఆప్ నేతలు విజయ్ నాయర్, మనీశ్ సిసోడియా ద్వారా కవిత అనుచరులు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యవహారం నడిపించారు. ఇప్పటికే  సిసోడియా, విజయ్ నాయర్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు” అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

కవిత తరఫున బుచ్చిబాబు.. 

సౌత్ గ్రూప్ లో కవిత తరఫున ఆమె మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు పని చేశారని కోర్టుకు ఈడీ తెలిపింది. కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పని చేసినట్టు చెప్పింది.  ‘‘బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ చాట్స్ లో సాక్ష్యాధారాలు దొరికాయి. అనంతరం అప్రూవర్ గా మారిన రాఘవ వాటిని ధ్రువీకరించారు. ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత లబ్ధి పొందారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు విడతలుగా రూ.25 కోట్లను బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. అలాగే లిక్కర్ వ్యాపారంలో భాగం కావాలని శరత్ చంద్రారెడ్డిని పిళ్లై సంప్రదించారు. పిళ్లై సలహాతో శరత్ హైదరాబాద్ లో కవితను కలిశారు. లిక్కర్ పాలసీలో మార్పుల కోసం రూ.100 కోట్లు ఇవ్వాలని కేజ్రీవాల్ అడిగినట్టుగా శరత్ కు కవిత చెప్పారు. రూ.100 కోట్లలో కొంత మొత్తం ఇచ్చేందుకు శరత్ ముందుకొచ్చారు” అని వివరించింది. 

శరత్ చంద్రారెడ్డి ప్రధాన లబ్ధిదారు.. 

కవిత తన మేనల్లుడు మేకా శ్రీశరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా నియమించారని, ఆయన ఒక్కరోజు ఉద్యోగానికి హాజరుకాకపోయినా నెలకు రూ.లక్ష జీతం చెల్లించారని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా శరణ్ ను పిలిస్తే, ఆయన విచారణకు హాజరుకాలేదని పేర్కొంది. ‘‘లిక్కర్ స్కామ్​లో శరత్ చంద్రారెడ్డి అమాయకుడు కాదు.

ఈ వ్యాపారంలో ఆయన ప్రధాన లబ్ధిదారుడు. ఈ పాలసీతో ఆయన 5 రిటైల్ జోన్లు పొందారు” అని చెప్పింది. ఈ క్రమంలో కవిత తరఫు అడ్వొకేట్ రాణా జోక్యం చేసుకుని.. ‘‘లిక్కర్ స్కామ్ లో కవిత తరఫున బుచ్చిబాబు పనిచేస్తే ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు?” అని ప్రశ్నించారు. దీనికి ఈడీ లాయర్ బదులిస్తూ.. బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిందని గుర్తు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలోనే బుచ్చిబాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిపారు.  

ఎలక్టోరల్ బాండ్లతో సంబంధం లేదు.. 

లిక్కర్ కేసుకు ఎలక్టోరల్ బాండ్లతో సంబంధం లేదని కోర్టుకు ఈడీ తెలిపింది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? ఎవరు ఏ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారనేది ఈ కేసులో అనవసరమని చెప్పింది. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని.. అప్రూవర్లను ప్రలోభపెట్టారని అనుమానించడమంటే, కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడమే అవుతుందని అన్నారు. 

కవితకు తాను బినామీ అంటూ పిళ్లై మొదట వాంగ్మూలం ఇచ్చారు. అయితే కవితకు నోటీసులు ఇచ్చిని తర్వాత ఆయన ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. కవిత ఒత్తిడితోనే పిళ్లై వెనకడుగు వేశారు. అంతేకాకుండా కవిత, కేజ్రీవాల్, సిసోడియా మధ్య అవగాహన ఒప్పందం ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్లు డ్రాఫ్ట్ పాలసీని కవితకు పంపించారు. ఆ తర్వాత ఆమె చెప్పిన మార్పుచేర్పులు అందులో చేశారు” అని వివరించారు. 

ఫోన్లన్నీ ఫార్మాట్ చేసిన్రు.. 

కవిత తన ఫోన్లలోని డేటాను డిలీట్ చేశారని కోర్టుకు ఈడీ తెలిపింది. ‘‘ఈడీకి సమర్పించిన 10 ఫోన్లనూ కవిత ఫార్మాట్ చేశారు. ఎందుకు డేటా డిలీట్ చేశారని అడిగితే ఆమె జవాబు చెప్పలేదు. పోయినేడాది మార్చి 14, 15 తేదీల్లో కవిత తన నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అప్రూవర్లను బెదిరించడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేశారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దు’’ అని కోరుతూ వాదనలు ముగించింది. కవిత తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తమ వాదనలను లిఖితపూర్వకంగా రిజాయిండర్ రూపంలో సమర్పిస్తామని చెప్పారు. దీంతో ఇరువైపులా వాదనలు ముగిస్తున్నట్లు స్పెషల్ జడ్జి కావేరి బవేజా వెల్లడించారు. తీర్పును మే 6కు రిజర్వ్ చేశారు.  

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి: బుచ్చిబాబు 

అప్రూవర్ గా మారిన కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.