స్టాండ్ విత్ హర్ కాదు.. గివ్ హర్ స్పేస్..పురుషాధిక్యతను ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు: కవిత

స్టాండ్ విత్ హర్ కాదు.. గివ్ హర్ స్పేస్..పురుషాధిక్యతను ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు: కవిత
  • స్త్రీలకు అన్నింట్లోనూ 50 శాతం వాటా ఉండాలి
  • జాగృతి ఆఫీసులో మహిళా దినోత్సవం.. గివ్ హర్ స్పేస్ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: ఏడాదిలో ఒకరోజే కాకుండా.. ప్రతిరోజు మహిళా దినోత్సవంలా ఉండేలా పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇండ్లు, స్కూల్, హాస్పిటల్ ఏది నడవాలన్న మహిళలు ఉండాల్సిందేనని.. జయశంకర్ సార్, కేసీఆర్ లాంటి వాళ్లు ఈ నేలపై నడిచారంటే వాళ్ల తల్లులే కారణమని పేర్కొన్నారు. సామాజిక, పురుషాధిక్యతను ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దని పిలుపునిచ్చారు.

మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమం లేదన్నారు. హైదరాబాద్​లోని జాగృతి ఆఫీస్​లో ఆదివారం ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నేతలతో కలిసి ‘గివ్ హర్ స్పేస్’ పోస్టర్ ను కవిత ఆవిష్కరించారు. ఇప్పుడు పురుషులు చేయాల్సింది స్టాండ్ విత్ హర్ కాదని.. గివ్ హర్ స్పేస్ అని అన్నారు. సమాజానికి సేవ చేసేందుకు చాలా మంది మహిళలు ఆసక్తితో ఉన్నారని, కానీ పొలిటికల్ పార్టీలు వారికి అవకాశం ఇవ్వడం లేదన్నారు.

జాగృతిలో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. మహిళలకు 33 శాతం కాదు 50 శాతం వాటా ఉండాలన్నారు. జాగృతి అక్కాచెల్లెలు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయటం కారణంగానే మహిళా బిల్లు వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా బిల్లు అమల్లోకి రావాలని ఆకాంక్షించారు.  

ఏ ఇంట్లో పుట్టినా వివక్షే 

ఏ ఇంట్లో పుట్టినా సరే మహిళలపై వివక్షే ఉందని కవిత పేర్కొన్నారు. సీఎం స్టాండ్ విత్ హర్ అంటూనే మహిళలను అవమానించారని విమర్శించారు. మహిళలతో మగవాళ్లు నిలబడితేనే భద్రతా?.. మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ ఇవ్వటం ఈ ప్రభుత్వానికి చేతకాదా? అని ప్రశ్చించారు. స్టాండ్ విత్ హర్ కాదు.. ‘గివ్ హర్ స్పేస్’ అనేది జాగృతి నినాదమన్నారు. మహిళల రక్షణ అందరి బాధ్యత అని, అది బిక్షం కాదని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నిజమైన హక్కులు, సమానత్వం, స్వాతంత్రం, స్వేచ్ఛ మహిళలకు ఇంకా రాలేదని పేర్కొన్నారు.  

డబ్బు సంపాదించాలి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కచ్చితంగా పౌష్టికాహారం తినాలని మహిళలకు కవిత సూచించారు. మహిళలకు కచ్చితంగా ఎక్సర్ సైజ్ అవసరమన్నారు. సమాచారం, లోక జ్ఞానం కోసం నిరంతరం చదవుతూ ఉండాలన్నారు. భర్త, పిల్లల సంపాదనపై ఆధారపడవద్దని, మన డబ్బు మనమే సంపాదించుకోవాలని సూచించారు. మహిళలకు ఫ్రీ బస్ కాదు.. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.