లిక్కర్​ కేసు అప్​ డేట్​: కవిత పిటిషన్​ మార్చి 13 కు వాయిదా

లిక్కర్​ కేసు అప్​ డేట్​:  కవిత పిటిషన్​ మార్చి 13 కు వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను మార్చి13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.   . లిక్కర్‌ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరింది. కాగా.. సీఆర్పీసీ ప్రకారం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. 

తనను ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే బుధవారం ( ఫిబ్రవరి 28)  పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా.. తగినంత సమయం లేకపోవడంతో కోర్టు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది సుప్రీం కోర్టు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికల వేళ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడటంతో ఆ ఆదేశాలు అలాగే కొనసాగనున్నాయి.