- ఎవరెవరో వచ్చి తెలంగాణను అవమానిస్తున్నరు: కవిత
- ఆంధ్రా అనకొండలను గుంటనక్కే పెంచుతున్నడు
- వారితో ఆయన పాలవ్యాపారం వల్లే బీఆర్ఎస్ మాట్లాడట్లేదని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఇడుపు కాయితం అనే పదానికి అర్థం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అయితే బాగా చెబుతారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత అన్నారు. ఎవరెవరో వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ భాష, యాసపై దాడి చేస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదన్నారు. ఒకసారి అలా అవహేళన చేసినందుకే తెలంగాణ తెచ్చుకున్నామని.. మళ్లీ అదే విధంగా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మీ భాషను మేము, మా భాషను మీరు గౌరవించుకుంటూ ఎవరికీ వారు బతుకుదామని సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆంధ్రా అనకొండలు, కార్పొరేట్ శక్తులకు పాలుపోసి పెంచుతున్నది బీఆర్ఎస్లోని గుంటనక్కేనని మండిపడ్డారు. నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు పాలు పోస్తున్న సంస్థ గుంటనక్కదేనన్నారు. ఆంధ్రావాళ్లతో ఆయన పాలవ్యాపారం కారణంగానే తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగినా బీఆర్ఎస్ మాట్లాడడం లేదన్నారు. ఆ పార్టీకి తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందన్నారు. ఆదివారం ఉప్పల్ పిస్తాహౌస్ చౌరస్తాలో పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వంపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణపై ఇంతలా దాడి జరుగుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉందని విమర్శించారు. బీజేపీ కూడా తెలంగాణ సమస్యలను పట్టించుకోదన్నారు. ఈ ప్రాంతం హక్కులు, అస్తిత్వం కోసం టీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణలోని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, విద్యాసంస్థలకు ప్రభుత్వ డెయిరీ సంస్థల నుంచి పాలు సప్లయ్ అయ్యేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం జులై 2న భారీ భూపోరాటం చేస్తామన్నారు.
