కవిత కస్టడీ పొడిగింపు

కవిత కస్టడీ పొడిగింపు
  • కేజ్రీవాల్, సిసోడియా కస్టడీ కూడా.. 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ (ట్రయల్) కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో గతంలో విధించిన కస్టడీ బుధవారం ముగియడంతో అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 

ఆమెతో పాటు ఇదే కేసులో అరెస్టయి తిహార్ జైల్​లో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. ఈడీ, సీబీఐ తరఫు అడ్వకేట్లు వాదిస్తూ.. కవిత, కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసు కీలక దశలో ఉన్నందున నిందితులు బయటకొస్తే సాక్షాలను ప్రభావితం చేసి, ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు.. సీబీఐ కేసులో ఈ నెల 9 వరకు, ఈడీ కేసులో 13 వరకు ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 

నాలుగు నెలలుగా జైలులోనే కవిత...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాదాపు 4 నెలలుగా జైలులోనే ఉన్నారు. మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను  హైదరాబాద్​లోని తన నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.  మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. ఆమె జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అదుపులోకి తీసుకుంది. తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారని బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించాయి. తనపై వేసిన చార్జ్​షీట్ లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ మరోసారి కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఆగస్టు 5న కోర్టులో విచారణ జరగనుంది.