- డిపెండెంట్‌ఉద్యోగాల్లో కార్మికులకు అన్యాయం
- సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోంది : టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
- కాసిపేట-1 బొగ్గుగనిపై సింగరేణి బాయిబాట కార్యక్రమం ప్రారంభం
కోల్‌బెల్ట్/మంచిర్యాల, వెలుగు : ‘కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే సింగరేణికి ఎక్కువ కోల్‌బ్లాక్‌లు వచ్చేలా ప్రయత్నం చేయాలి’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కవిత సవాల్ చేశారు. టీఆర్ఎస్, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమాన్ని సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట-1 బొగ్గుగనిపై ప్రారంభించారు.
అనంతరం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల్లో కార్మికులకు అన్యాయం జరుగుతోందని, సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఐటీ మాఫీ చేస్తామని కిషన్‌రెడ్డి చెబుతున్నారని, కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు.
‘సింగరేణి బొగ్గు మాయం ఘటనపై ఒకరు లేఖ రాయగానే కిషన్ రెడ్డి ఆరా తీస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సింగరేణిలో పోస్టింగ్‌లు జీఎం ఇచ్చే వారని, ఇప్పుడు మాత్రం సీఎం ఇస్తున్నారన్నారు. జీఎం చేయాల్సిన పనులను సీఎం చేస్తుంటే, క్లర్క్ చేయాల్సిన పనులను డిప్యూటీ సీఎం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిని కాపాడాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రూ. 50 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఐటీ మాఫీ, సొంతింటి కల, డిపెండెంట్ల సమస్యలు తీర్చాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక యువతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సాహిస్తామని హామీ ఇచ్చారు. రూ.10 లక్షల విలువ కూడా లేని సంస్థతో లిథియం అయాన్ బ్యాటరీ సంస్థ ఏర్పాటు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల కేంద్రంగా టీఆర్ఎస్ రాజకీయం చేయబోతోందని, అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాగా, కాసీపేట గని వద్ద బాయిబాట కార్యక్రమానికి కవిత రాగా గేట్‌మీటింగ్‌కు పర్మిషన్ లేదంటూ పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు ఎండి.రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
పోడు భూములకు రక్షణ కల్పించాలి
ఆసిఫాబాద్, వెలుగు : పోడు భూముల సాగుకు అడ్డొస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్, కుమ్రంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల భూముల విషయంలో అనవసర వివాదాలు సృష్టించడం మానుకోవాలని, చట్టాల పరిధిలోనే ఆఫీసర్లు పనిచేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూరియా యాప్ కారణంగా రైతులు ఎరువుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు డిస్కం పేరుతో రైతులపై అదనపు భారం మోపడం సరికాదన్నారు.
