కవిత లేఖతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​లో లుకలుకలు బయటపడ్డయ్ : ఆది శ్రీనివాస్

కవిత లేఖతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​లో లుకలుకలు బయటపడ్డయ్ : ఆది శ్రీనివాస్
  • విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్​కు రాసిన లేఖతో బీఆర్ఎస్ లోని లుకలుకలు బయటపడ్డాయని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.  బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని తాము చేస్తున్న ఆరోపణలను కవిత ఈ లేఖలో సమర్థించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని  కవిత చెప్పకనే  చెప్పినట్లయిందని అన్నారు. బీజేపీపై పల్లెత్తు మాట మాట్లాడని కేసీఆర్ తీరును కడిగి పారేశారని చెప్పారు. రాష్ట్రంలో  బలహీనపడడంతోనే ఆ పార్టీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత ఈ లేఖలో అంగీకరించారని  వెల్లడించారు. 

కవిత పచ్చి నిజాలు బయటపెట్టారని, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా  నిలదీశారని అన్నారు. కవిత లేఖపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకత్వం స్పందించి.. ప్రజలకు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్​ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ మీద ఒంటికాలిపై లేస్తున్న కేటీఆర్.. ముందుగా తన చెల్లికి సమాధానం చెప్పాలన్నారు. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని అన్నారు.

కవిత రాసిన లేఖ లీక్​కు కాంగ్రెస్​కు  సంబంధం లేదు: ఎమ్మెల్సీ అద్దంకి 

కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను కాంగ్రెస్ లీక్ చేసిందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వాళ్లు మాట్లాడడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.  ఇలాంటి రాజకీయాలను కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఇలాంటి దుస్థితి కాంగ్రెస్ కు పట్టలేదన్నారు. వరంగల్ లో నిర్వహించిన రజతోత్సవ సభతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లో చిచ్చురేగిందని, పార్టీ అంతర్గత అంశాలను కేసీఆర్ తో చెప్పుకోలేనంత గ్యాప్ కవితకు వచ్చిందని ఈ లేఖతో స్పష్టమైందని తెలిపారు. 

కేటీఆర్.. ముందు మీ చెల్లిని ప్రశ్నించు: ఎమ్మెల్సీ వెంకట్

‘‘కేటీఆర్.. పదే పదే ప్రశ్నిస్తా అంటున్నావు కదా.. ముందు మీ చెల్లె కవితను ప్రశ్నించు’’     అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ     బల్మూరి వెంకట్ అన్నారు.  ప్రజలకు మీపై ఉన్న అనుమానాలను మీ చెల్లె ఆ లేఖలో ప్రస్తావించారని, ముందు వాటికి సమాధానం  చెప్పాలని అడిగారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తానాపై కూడా కేటీఆర్ జవాబివ్వాలని వెంకట్​ డిమాండ్ చేశారు.

కవిత లేఖతో బీఆర్ఎస్ వీక్: ఎంపీ చామల 

కవిత రాసిన లేఖతో బీఆర్ఎస్ వీక్ అయిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.  కేటీఆర్ కు పార్టీలో పట్టాభిషేకం చేయడాన్ని కవిత ఈ లేఖతో అడ్డుకున్నదని తెలిపారు. కవిత అడిగిన ప్రతి పశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.