- గంట ఆట కోసంరూ.10 కోట్లా?: కవిత
- సింగరేణి కార్మికుల నిధులు వాడుకున్నారని విమర్శ
బషీర్‌బాగ్, వెలుగు: గంటసేపు ఎంటర్టైన్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు ఖర్చు చేశారని, అందులో సింగరేణి కార్మికుల నిధులు ఉపయోగించడం అన్యాయమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మెస్సీ మ్యాచ్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తన ఫండ్ నుంచి సింగరేణికి రూ.10 కోట్లు వెంటనే తిరిగి చెల్లించాలన్నారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లకుండా మ్యాచ్‌కు వెళ్లడం దురదృష్టకరమని, విద్యార్థులకు ఇచ్చిన హామీలు విస్మరించారని మండిపడ్డారు. ‘జాగృతి జనం బాట’లో భాగంగా ఆదివారం ఆమె హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అనంతరం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన అశాస్త్రీయంగా జరిగి ఒకే పార్టీకి లాభం చేకూరేలా చేశారని, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, మల్కాజిగిరిలో ప్రజా ప్రతినిధుల సంఖ్య తగ్గిపోయిందని ఆరోపించారు.
బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో తెలంగాణవాదుల పక్షానే ఉంటానని, రవీంద్రభారతిలో తెలంగాణ జానపద కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు 7,500 నుంచి 3,500కి తగ్గాయని, సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాల భవన్‌కు రూపాయి కేటాయించలేదు..
గత 12 ఏండ్లుగా బాల భవన్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కవిత విమర్శించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని జవహర్ బాల భవన్‌ను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. తన చిన్నతనంలో బాల భవన్, ఆకాశవాణి కేంద్రానికి వచ్చేవారమన్నారు. అప్పట్లో ఎన్నో సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు జరిగేవని, నేడు నిధులు, నిర్వహణ లేకపోయినా పిల్లలు, కళాకారులు వస్తుండటం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో బాల్య జ్ఞాపకాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గోషామహల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి, ధూల్‌పేటలో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. మెహదీపట్నం రైతు బజార్‌ను సందర్శించి రైతులు, వ్యాపారులు, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
