సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా..?: కవిత సంచలన వ్యాఖ్యలు

సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా..?: కవిత సంచలన వ్యాఖ్యలు

జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ( నవంబర్ 1 ) కరీంనగర్ లో పర్యటించిన కవిత ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు అవమానం జరిగింది కాబట్టే బయటికి వచ్చానని..అన్యాయం జరిగినా భరించేదాన్నని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వార్త వినగానే కడుపులో దేవినట్లయ్యిందని అన్నారు. సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. 

ఆత్మగౌరవం కోసమే పార్టీ నుంచి బయటికి వచ్చానని.. బీఆర్ఎస్ లో చాలామంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని అన్నారు కవిత. బీఆర్ఎస్ వీడి జనంబాట పట్టాక బీఆర్ఎస్ నేతలు చాలామంది తనతో టచ్ లోకి వచ్చారని అన్నారు.జనాంబాటలో భాగంగా పాత క్యాడర్ తనతో మాట్లాడుతున్నారని అన్నారు కవిత.

ఇదిలా ఉండగా.. కరీంనగర్ జిల్లాలో మెంథా  తుపానుతో నష్టపోయిన పంటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. తుపాను, నిరంతర వర్షాల కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు జరగకపోవడం, వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుండటం లాంటి సమస్యలు రైతుల జీవితాలను దయనీయంగా మారుస్తాయని కవిత అన్నారు.

ధాన్యం మెులకలు వచ్చి, బూజు పట్టి, తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. . ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేలు పరిహారం ఇస్తానంటోందని.. అది ఏ మూలకు సరిపోదన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత.