- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, వారి పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖలో యూనిఫామ్స్ ఆర్డర్ ను ఏకపక్షంగా రద్దు చేశారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.105 కోట్ల విలువైన యూనిఫామ్స్ ఆర్డర్ ను రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలకు ఇస్తుంటారని, దీని ద్వారా సహకార సంఘాల్లోని వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వం విద్యాశాఖ యూనిఫామ్స్ ఆర్డర్ రద్దు చేయడంతో ఇప్పుడు కార్మికులు వీధినపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి సంబంధించిన ఆర్డర్ ను కూడా టెస్కో కు ఇవ్వకపోవడం కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేయడమేనన్నారు. గడువు ముగిసినప్పటికీ టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
