ఇది ఫేక్ బడ్జెట్..అన్ని వర్గాలకూ అన్యాయం: కవిత

ఇది ఫేక్ బడ్జెట్..అన్ని వర్గాలకూ అన్యాయం: కవిత
  • లక్షల కోట్ల అప్పులు తెస్తున్నా.. ప్రజలకు మేలు జరగట్లే
  • కాంగ్రెస్​ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేకుతున్నరు
  • అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్​ ప్రభుత్వమని కామెంట్​  

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఫేక్, రివిజన్, ఫ్యాబ్రికేటెడ్​ బడ్జెట్ ​ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దివ్యాంగులు, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు బడ్జెట్​లో అన్యాయం చేశారని అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. రైతుభరోసా, చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు నిరుడు కేటాయించిన నిధులనే అక్షరం మార్చకుండా కొత్త బడ్జెట్ లోనూ పెట్టారని విమర్శించారు.

ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫేక్​ హామీలిచ్చారని.. కానీ బడ్జెట్ లో మాత్రం 4 శాతం నిధులే కేటాయించి బీసీలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం మంది ఉన్న బీసీలకు 4 శాతం నిధులు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దాదాపు రూ.8.64 లక్షల కోట్లు అప్పు చేసి ప్రతి ఒక్కరి తలపై రూ.2.16 లక్షల భారం మోపారన్నారు.

ఒక్కో కుటుంబంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.9 లక్షల అప్పులు మోపిందన్నారు. ప్రధాని మోదీ తన బడే భాయ్ అంటూ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఎందుకు తేలేదో చెప్పాలన్నారు. ప్రజలకు మేలు చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేకుతున్నారని.. అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వమని కవిత ఫైర్​ ఎద్దేవా చేశారు. 

రాహుల్​ హామీలు ఫేక్​..

రాహుల్​ గాంధీ ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద హామీలిచ్చారని.. ఆయన ఇచ్చిన హామీలన్నీ ఫేక్​ అని కవిత అన్నారు. హైదరాబాద్​లో సలీం ఫేక్ అనే నటుడి మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా ఫేక్ మాటలు చెబుతుంటారని విమర్శించారు. సలీం ఫేక్ తన మాటలతో నవ్విస్తే.. రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు.

బడ్జెట్​లో తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న స్కీం ఈసారి కూడా పత్తా లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గతేడాదితో పోల్చితే రూ.7 వేల కోట్లు కోత పెట్టారని అన్నారు. సింగరేణి, ట్రాన్స్, జెన్ కోకు ఇవ్వాల్సిన 1.50 లక్షల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కొత్త ఉద్యోగాల నియామకాలకు ఎలాంటి కేటాయింపులు లేవని, ఉద్యోగులు, పెన్షనర్లకు బడ్జెట్​లో ఎలాంటి కొత్త కేటాయింపులు లేవన్నారు. కమీషన్లు వచ్చే యంగ్ ఇండియా స్కూళ్లకు మాత్రం రూ.5 వేల కోట్లు కేటాయించారని విమర్శించారు. టీచర్ల రిక్రూట్ మెంట్ లేకుండా స్కూల్స్ నిర్మించి ఏం ప్రయోజనమని ఆమె ప్రశ్నించారు.