- గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్న..
- కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్తం
- నాది ప్రజల ఎజెండా.. సమస్యలపై పోరాటంలో రాజీ ఉండదు
- ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా ఎఫెక్ట్ ఉంటుంది
- మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి తర్వాత మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీని ప్రకటిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. అజెండాపై కసరత్తు చేస్తున్నామని, గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నానని పేర్కొన్నారు. డాడీ, మోదీ, చిన్న మోదీపై తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ రాజీ లేదని, కొత్త పార్టీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం తెలంగాణ జాగృతి ఆఫీసులో మీడియాతో ఆమె చిట్‌చాట్ చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే జాతీయస్థాయి నేతలను కలుస్తానని చెప్పారు. తనకు భేషజాలేం లేవని, అందరినీ కలుపుకుని పోతానని తెలిపారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీ నేతలతో సమావేశమవుతానని, ప్రజా సంఘాలనూ కలుపుకొని పోతామన్నారు.
కొత్త పార్టీకి ఉన్న టెక్నికల్ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, పార్టీ ఆఫీసు కోసం జాగా చూస్తున్నామని చెప్పారు. పేదలకు ఉపయోగపడే ఒక మంచి స్కీమ్ తన ఆలోచనలో ఉందని తెలిపారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై చర్చిస్తున్నామని, ఉమ్మడి నిజామాబాద్, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్ నగర్, వనపర్తి నుంచి కూడా పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరుతున్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తానని, మండలాల వారీగా పార్టీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందన్నారు. తాను నిజామాబాద్‌కు దూరమయ్యాక బీఆర్‌ఎస్ తీవ్రంగా నష్టపోతున్నదని చెప్పారు.
ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశం..
ఉద్యమంలో పనిచేసిన యువతకు పార్టీలో అవకాశం ఇస్తానని కవిత చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో తమ కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్రమంతటా పోటీ చేయాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. తనది ఒకటే ఎజెండా అని, అదే ప్రజల ఎజెండా అని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లపైనే తన పోరాటమన్నారు.తన పోరాటాలన్నీ ఖమ్మం వెలుగుమట్ల తరహాలోనే ఉంటాయని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేస్తానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీతో తనకున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ వాడుకుంటున్నారని, అసెంబ్లీలోనూ దానిపై చర్చ పెడుతున్నారని విమర్శించారు.
జాగృతి ప్రజా బడ్జెట్.. రూ.2.15 లక్షల కోట్లు..
రాష్ట్ర బడ్జెట్‌ను రూ.2,15,200 కోట్లతో జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రటించారు. ఉగాది సందర్భంగా జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని, ఆ బడ్జెట్‌ను ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇకపై ఏటా ఉగాది నాడు జాగృతి తరఫున ప్రజా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. గురువారం జాగృతి ఆఫీసులో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో కవిత, అనిల్ దంపతులతో పాటు జాగృతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం కవిత మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకుపైగా అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని, తాము కేవలం రూ.2.15 లక్షల కోట్లతోనే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి అదనంగా మరో రూ.లక్ష కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ మొత్తం గాంధీ కుటుంబ సభ్యులే కాదు తమకు నచ్చిన వారి పేర్లతో పథకాలు ప్రకటించుకోవచ్చని చెప్పారు.
తాము ప్రతిపాదించిన మొత్తం ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ఉపయోగపడేలా ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకే తాము ఈ ప్రజా బడ్జెట్‌ను కేటాయించామన్నారు. ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. తాము ప్రతిపాదించిన బడ్జెట్‌తో రాష్ట్ర పురోగతితో పాటు సంపద సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు.
