కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి?... జనవరి 23న ఈసీఐకి దరఖాస్తు చేసిన కవిత

కవిత పార్టీ పేరు  తెలంగాణ ప్రజా జాగృతి?... జనవరి 23న ఈసీఐకి దరఖాస్తు చేసిన కవిత
  •     పార్టీ రిజిస్ట్రేషన్ పెండింగ్​పెట్టిన ఈసీఐ
  •     జాప్యం చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్​

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’(టీపీజే) అని ఢిల్లీ హైకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ద్వారా స్పష్టమవుతున్నది. ఈ ఏడాది జనవరి 23న టీపీజే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఆమె దరఖాస్తు చేసుకున్నారు. 

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన చారిత్రాత్మక స్వరాష్ట్ర సాధన ఉద్యమం స్ఫూర్తి నుంచే ‘తెలంగాణ ప్రజా జాగృతి’(టీపీజే) పార్టీ సైద్ధాంతిక స్ఫూర్తి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుండడంతో ఈసీఐ ఏకపక్షంగా జాప్యం చేస్తున్నదని ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(సీ) లను ఉల్లంఘించడమే. ఈసీఐ ఎలాంటి పరిశీలన చేపట్టలేదు, ప్రజా ప్రకటనను ప్రచురించలేదు. అలాగే సెక్షన్ 29 ఏ(7) కింద విచారణకు అవకాశం ఇవ్వలేదు. 

ఎటువంటి వివరణ లేకుండా దరఖాస్తును పెండింగ్​లో పెట్టింది’’ అని ఆమె పిటిషన్​లో పేర్కొన్నారు. అయితే ఆ దరఖాస్తులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని ఫిబ్రవరి 23న ఈసీఐ నోటీసు పంపించింది. ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో ఈసీఐ తరఫు న్యాయవాది ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. ఆ రోజు కవిత తరఫు లాయర్ హాజరు కాకపోవడంతో కేసు మార్చి 19కి వాయిదా పడింది. గురువారం జస్టిస్ అమిత్ బన్సల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించింది. కవిత తరఫున రిషి కుమార్ సింగ్ గౌతమ్, ఈసీఐ తరఫున సంజయ్ వశిష్ట్ కోర్టులో వాదనలు వినిపించారు. 

తొలుత రిషి కుమార్ వాదనలు వినిపిస్తూ... ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 కింద పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టుకు నివేదించారు. అవసరమైన అన్ని పత్రాలు, పార్టీ రాజ్యాంగం, నోటరైజ్డ్ అఫిడవిట్లు, 151 మంది సభ్యుల సభ్యత్వ జాబితా, సర్వసభ్య సమావేశం జరిగినట్లు చూపే మినిట్స్, ప్రత్యామ్నాయ పార్టీ పేర్లు, రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశిత రుసుము, రిజిస్ట్రేషన్ దరఖాస్తు పత్రాలను దాఖలు చేసినట్లు వివరించారు. 

అప్పటి నుంచి దరఖాస్తు పరిశీలించేందుకు ఈసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఈసీఐ జాప్యం ఏకపక్షమని, తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కవితను నిరోధించడమే అవుతుందని వాదించారు. ఇది ఎన్నికల్లో పోటీచేయాలనే పిటిషనర్ చట్టబద్ధ హక్కును కాలరాస్తుందని వాదించారు. అనంతరం ధర్మాసనం కవిత దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.