- టీఆర్ఎస్పై కేంద్ర ఎన్నికల సంఘానికి 600కుపైగా అభ్యంతరాలు
- 14 ఏండ్ల ఉద్యమ సంబంధమున్న పేరంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు
- కవిత ప్రకటనకు ముందే దరఖాస్తు చేశామన్న మహారాష్ట్ర వ్యక్తి
హైదరాబాద్, వెలుగు: కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’కు పేరు కష్టాలు తప్పడం లేదు. ఆమె పార్టీకి బీఆర్ఎస్ సహా పలువురి నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘టీఆర్ఎస్’ను కాదని ‘బీఆర్ఎస్’కు మారిన ఆ పార్టీ పెద్దల నుంచి కూడా.. కవిత ఓన్ చేసుకోవాలనుకున్న ‘టీఆర్ఎస్’కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ పేరుపై ఇప్పటిదాకా కేంద్ర ఎన్నికల సంఘానికి 600కుపైగా అభ్యంతరాలు వచ్చాయి.
14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ‘టీఆర్ఎస్’ అనే పేరు సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వెల్లడించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్గానే గుర్తిస్తారని, ఇలాంటి టైంలో ఆ పేరును వేరే ఎవరికీ కేటాయించరాదని బీఆర్ఎస్ పెద్దలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఇటు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మాండ్యాల్.. కవిత పార్టీ పేరుపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
కవిత పార్టీ పేరు ప్రకటనకు ముందే తాను టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్రసామాజిక సేన) పేరుకు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు టీఆర్ఎస్ పేరును ఇవ్వొద్దని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరినట్టు తెలుస్తున్నది. తమకు టీఆర్ఎస్ ఇవ్వాల్సిందేనని ఎన్నికల సంఘాన్ని మహాదేవ్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే రెండు పేర్లు నమోదయ్యాయి. తెలంగాణ రాజ్యసమితి పార్టీ కూడా కవిత పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత పార్టీ పేరుపై సందిగ్ధం నెలకొంది.
పేర్లతో కన్ఫ్యూజన్..
ఏప్రిల్25న కవిత పార్టీని అంగరంగవైభవంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సేన (అసోసియేషన్) పేరును ప్రకటించారు. టీఆర్ఎస్అనే ఆరోజు ఆమె ప్రకటించినా.. అసోసియేషన్ అనేది కూడా ఉందని ట్రోల్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చారు. అదే నెల 30న పత్రికల్లో ప్రకటనలూ ఇచ్చారు. పార్టీ పేరులో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినా.. అది కేవలం వ్యూహాత్మకంగానే తొలుత ఆ పేరును ప్రకటించినట్టు చెప్పుకొచ్చారు.
పేపర్లలో ప్రకటనల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి 600కుపైగా ఫిర్యాదులు వెళ్లాయి. అయితే, ఆ అభ్యంతరాల్లో ఎక్కువ భాగం బీఆర్ఎస్ పెద్దలే ఎన్నికల సంఘానికి ఇప్పించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అభ్యంతరాలు తెలిపిన వారిలో పేర్లు తప్ప.. దాదాపు 90 శాతం వరకు ఒకే ఫార్మాట్‌తో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దలే కావాలని తమకు ఆ పేరు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ‘తెలంగాణ’ సోల్‌ను వదులుకుని పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నాక.. ఇంకా ఎందుకు టీఆర్ఎస్పై అభ్యంతరాలు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
