మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ లో పెద్దపులులు కనిపించకపోయినా చిరుతలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. దాదాపు100కు పైగా చిరుతలు ఉన్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఒక్క జన్నారం డివిజన్ పరిధిలోనే 20కి పైగా తిరుగుతున్నాయి. డివిజన్లో 125 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వన్యప్రాణుల మూమెంట్ ను ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రకాల జంతువులతో పాటు చిరుతలు తరచుగా సీసీ కెమెరాల్లో ట్రాప్ అవుతున్నాయి. నిరుటి మార్చి, ఏప్రిల్ నెలల్లో జన్నారం డివిజన్లోని బంగారు తండా, దేవునిగూడెం, కిష్టాపూర్, లోతొర్రే బీట్లలో చిరుతల కదలికలను ఆఫీసర్లు గుర్తించారు.
ఇవి ఖానాపూర్ డివిజన్ పరిధిలోని కోర్ ఏరియాలో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవి పందులు, కుందేళ్లు వంటి శాకాహార జంతువులను ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నాయి. ఆహారం కోసం కొన్నిసార్లు అటవీ గ్రామాల పరిసరాల్లోకి వస్తున్నాయి. మేతకు వెళ్లిన మేకలు, పశువుల మందలపై దాడి చేసి వేటాడుతున్నాయి. చిరుతలు ఏటేటా వాటి సంతతిని పెంచుకుంటూ పోతున్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుల్లో చిక్కుకొని కొన్ని చనిపోతున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చిరుతలు కూడా ఎంతో దోహదం చేస్తాయన్నది తెలిసిందే.
కనిపించని పెద్దపులులు...
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ఫారెస్ట్ లో పులుల సంరక్షణకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు గుర్తించి 2012 ఏప్రిల్ లో టైగర్ జోన్ గా ప్రకటించింది. అప్పటినుంచి ఏటా స్పెషల్ఫండ్స్ రిలీజ్ చేస్తూ పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కవ్వాల్ పరిధిలో టైగర్స్ కనిపించడం లేదు. పొరుగునున్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా టైగర్ జోన్ల నుంచి పులులు కవ్వాల్ కు వచ్చి పోతున్నాయి తప్ప ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. కవ్వాల్ ఫారెస్ట్ లో అలికిడి ఎక్కువగా ఉండడం, శాకాహార జంతువులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల ఇక్కడ ఆగడం లేదు. పెద్దపులులను ఆకర్షించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా పెద్దపులి ఆహారంగా తీసుకునే జింకలు, దుప్పులు, మూషిక జింకల సంతతిని పెంచుతున్నారు. భవిష్యత్తులో కవ్వాల్ ఫారెస్ట్ పెద్దపులులకు ఆవాసంగా మారుతుందని ఆఫీసర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తీరొక్క వన్యప్రాణులు..
కవ్వాల్ టైగర్ జోన్ పలు రకాల వన్యప్రాణులకు ఆశ్రయమిస్తోంది. అరుదైన బైసన్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవి గుంపులుగా తిరుగుతూ సీసీ కెమెరాల కంటికి చిక్కుతున్నాయి. బైసన్(అడవి దున్నలు) ఒక్క జన్నారం డివిజన్లో 150కి పైగా ఉన్నాయి. అలాగే ఈ డివిజన్లో సాంబార్ లు 150, నీలుగాయిలు 250, చుక్కల జింకలు 300లకు పైగా ఉన్నాయి. తోడేళ్లు 10, నక్కలు, గుంటనక్కలు 20 కొండగొర్రెలు 50 వరకు ఉన్నాయి. గతంలో తరచుగా కనిపించే వీటి సంతతి ఇటీవల కాలంలో బాగా తగ్గింది. ఇక గడ్డి జింకలు 25, హానీ బడ్జెర్ 10, పునుగు పిల్లులు 25, ముళ్లపందులు 30కి పైగా ఉన్నట్టు అంచనా. వైల్డ్ డాగ్స్ (రేచుకుక్కలు) 100కు పైగా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. గుంపులుగా దాడి చేసి పులులను సైతం చంపేస్తాయి. అడవి పందులు వందల సంఖ్యలో ఉన్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ పంట పొలాల్లోకి రావడం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే కృష్ణజింకలు కవ్వాల్ ఫారెస్ట్ లో అరుదుగా ఉన్నాయి.
