ఐదేండ్లలో 200 ఇంటర్ సిటీ ట్రైన్స్ తయారీ..తుది దశకు కాజీపేట రైల్ యూనిట్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఐదేండ్లలో 200 ఇంటర్ సిటీ ట్రైన్స్ తయారీ..తుది దశకు కాజీపేట రైల్ యూనిట్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • ప్రతి ట్రైన్​లో 20 కోచ్‌‌‌‌లు.. గంటకు 130 కిలో మీటర్ల స్పీడ్
  • కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్​పై కేంద్ర మంత్రి సమీక్ష

న్యూఢిల్లీ, వెలుగు: కాజీపేట రైల్ తయారీ యూనిట్ పనులు తుది దశకు చేరినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇది బహుముఖ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ యూనిట్‌‌‌‌గా సేవలందించనున్నట్టు తెలిపారు. రాబోయే ఐదేండ్లలో ఈ యూనిట్ నుంచి 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు చెప్పారు.

కాజీపేట రైల్ యూనిట్‌‌‌‌ను కార్యాచరణలోకి తెచ్చే ప్రణాళికలపై గురువారం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీటింగ్ ముఖ్య అంశాలను రైల్వే శాఖ మీడియాకు వెల్లడించింది.   

మోడ్రన్ టెక్నాలజీ.. గంటకు 130 కిలో మీటర్ల స్పీడ్​

కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్ సిటీ రైళ్లను అత్యధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి  అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్​తో ఈ రైళ్లు దూసుకుపోతాయన్నారు. ప్రధానంగా పలు పట్టణాలు, నగరాల మధ్య సులభతర ప్రయాణాన్ని అందించేందుకు వీలుగా ట్రిప్ లో అనేక స్టాప్ లు ఉంటాయన్నారు. సమీప పట్టణాల్లో చదువుకునే విద్యార్థులు, ఆరోగ్య, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

ప్రతి ట్రైన్​లో 20 కోచ్‌‌‌‌లు మంచి డిజైన్, ఆధునిక సౌకర్యాలతో ఉంటాయన్నారు. ఎలాంటి కుదుపులు లేకుండా కప్లర్లు, బోగీలు ఉంటాయన్నారు. ప్రతి కోచ్ కు రెండు వైపులా టాయిలెట్ ఉంటుందని చెప్పారు. ఈ ట్రైన్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని  కేంద్ర మంత్రి తెలిపారు.