- చివరి దశ 11 కిలోమీటర్ల ప్రాజెక్ట్ పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే బోర్డు ప్రకటన
- రూ.3 వేల కోట్లతో 203 కిలోమీటర్ల పనులు
వరంగల్, వెలుగు: కాజీపేట– బల్లర్షా ట్రిప్లింగ్ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సుమారు రూ.3 వేల కోట్లతో కాజీపేట–-బల్హార్షా మధ్య 203 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. ఆసిఫాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర చేపట్టిన మూడో లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులతో పాటు బిబ్రా నదిపై నిర్మించిన బ్రిడ్జి బుధవారం పూర్తయింది. దీంతో గ్రాండ్ ట్రంక్ మార్గంలో ట్రిప్లింగ్ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు.
2015-16 పనులకు శ్రీకారం
కాజీపేట–-బల్లర్షా రైల్వే మార్గం దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలకమైన మార్గం. ఈ రూట్లో ప్రయాణికులతోపాటు బొగ్గు, సిమెంట్ రవాణా జరుగుతుంది. దీంతో కీలకమైన ఈ మార్గంలో రద్దీని తగ్గించడానికి రైల్వే శాఖ అధికారులు మొదట రాఘవపుర–-మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ పనులు చేపట్టి 2016లో పూర్తి చేశారు. ఆపై ఈ మార్గంలో ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసే పనులకు 2015–16 ఏడాదిలో పర్మిషన్ వచ్చింది. దీంతో మొత్తం 203 కి.మీ కాగా తెలంగాణలో 159కి.మీ, మహారాష్ట్ర పరిధిలో 44 కి.మీ ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులు చేపట్టారు. 2020 నుంచి ఇప్పటివరకు వివిధ దశల్లో పూర్తి చేయగా.. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే బల్లర్షా స్టేషన్ సమీపంలోని చిన్న భాగం మినహా.. ఈ మార్గంలో ట్రిపుల్ లైన్ నిర్మాణం పూర్తయింది.
ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ ఓ మైలురాయి
కాజీపేట–- బల్లర్షా ట్రిప్లింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం ఓ మైలురాయి. కీలకమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో ఈ ప్రాంతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చు. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే అనుసంధానం మరింత పెరుగుతుంది. విద్యుదీకరణతో పాటు ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తిచేయడంలో నిర్మాణ, ఇంజినీరింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఆపరేటింగ్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారు. -సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే జీఎం
