తెలంగాణకు కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ కీలక మీటింగ్

తెలంగాణకు కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ కీలక మీటింగ్
  • నోవాటెల్ హోటల్​లో ముఖ్య నేతలతో భేటీ
  • హాజరుకానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు
  • సెగ్మెంట్ల వారీగా రిపోర్టు అందించనున్న సునీల్ కనుగోలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ పెద్దలు.. రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలతో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీ బలం ఎలా ఉంది? అనే దానిపై కేసీ వేణుగోపాల్ కు సునీల్ కనుగోలు రిపోర్టు ఇవ్వనున్నారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రచారం ఎలా కొనసాగుతున్నది? ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? తదితర విషయాలను అందులో వివరించనున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. 

పెండింగ్ సీట్లపై క్లారిటీ!

రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా, అందులో 14 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లను పెండింగ్ లో పెట్టారు. ఈ మీటింగ్ లో పెండింగ్ సీట్లకు అభ్యర్థులపై కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం సీటుపై క్లారిటీ వస్తే, మిగిలిన రెండు సీట్లకు అభ్యర్థుల ప్రకటన ఈజీ అవుతుందని అంటున్నాయి. ఖమ్మం సీటుతోనే మిగిలిన రెండు సీట్ల అభ్యర్థుల ప్రకటన ముడిపడి ఉందని పేర్కొంటున్నాయి. సామాజిక సమీకరణల్లో భాగంగానే ఖమ్మంతో మిగిలిన రెండు సీట్ల వ్యవహారం పెండింగ్ లో పడిందని చెబుతున్నాయి. కాగా, అభ్యర్థులపై ఈ మీటింగ్ లో స్పష్టత ఇస్తే, ఇక ప్రచారంపై పీసీసీ ఫోకస్ పెట్టనుంది. 

వచ్చే నెలలో రానున్న రాహుల్, ప్రియాంక..  

వచ్చే నెలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రియాంక పర్యటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నేతలకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్ లో ప్రియాంక సభలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత రాహుల్ టూర్ ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఏఐసీసీ అగ్ర నేతల టూర్లపై మీటింగ్ లో చర్చించనున్నారు. అలాగే తన టూర్లపై అభ్యర్థులకు రేవంత్ వివరించనున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలపై నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన, గ్యారంటీల అమలు, ప్రజా పాలనపై జనంలో ఉన్న సానుకూల వాతావరణం, గత పదేండ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన తీరు, లిక్కర్ కేసులో కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర అంశాలపై చర్చించనున్నారు. 

సెగ్మెంట్ల వారీగా సీఎం సమీక్షలు.. 

రాష్ట్ర మంత్రులు తమకు అప్పగించిన లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు, మెదక్ లో కొండా సురేఖ, సికింద్రాబాద్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరిలో తుమ్మల నాగేశ్వర్ రావు, ఖమ్మం, వరంగల్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ లో సీతక్క, నల్గొండలో ఉత్త మ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల కిందట భువనగిరి నియోజకవర్గం సమీక్ష సమావేశం జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు. దీనికి రేవంత్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లి మండల స్థాయి నేతలతో సమీక్ష జరిపారు.