కేసీఆర్, కేటీఆర్ ​ఉద్యోగాలు ఊడగొట్టినందుకేయువతకు జాబులొస్తున్నయ్

కేసీఆర్, కేటీఆర్ ​ఉద్యోగాలు ఊడగొట్టినందుకేయువతకు జాబులొస్తున్నయ్
  •  ఈ మూడు నెలల మా పాలన చూసి ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి: రేవంత్​రెడ్డి
  • రేవంతన్న అంటే పలుకుతున్నా.. సీఎం పోస్టు తాతలు ఇచ్చిన ఆస్తి కాదు
  • గుంటూరులో చదువుకున్నోళ్లు నా ఇంగ్లిష్​ను హేళన చేస్తున్నరు
  • 119 సెగ్మెంట్లలో మోడ‌‌ల్ గురుకులాల ఏర్పాటు చేస్తం
  • ఎల్బీ స్టేడియంలో 5,192 ఉద్యోగ నియామ‌‌క ప‌‌త్రాల అంద‌‌జేసిన సీఎం

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​, కేటీఆర్​ ఉద్యోగాలు ఊడగొట్టడంతోనే తాము అధికారంలోకి వ‌‌చ్చామ‌‌ని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేర‌‌కు నియామ‌‌కాలు చేప‌‌డుతున్నామ‌‌ని చెప్పారు. గ‌‌త ప్రభుత్వ హ‌‌యాంలో ఎప్పుడు నోటిఫికేష‌‌న్ వ‌‌స్తుందో తెలియ‌‌ని పరిస్థితి. నోటిఫికేషన్ వేసిన వాటికి ప్రశ్నాప‌‌త్రాల లీకేజీలు, జరిగిన పరీక్షలకు పేపర్లు సరిగా దిద్దేటోళ్లు కాద‌‌ని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెల‌‌ల్లో ప‌‌రిపాల‌‌న‌‌ను అంచ‌‌నా వేసి వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల‌‌ని కోరారు. 

రేపు జ‌‌ర‌‌గ‌‌బోయే ఏ ఎన్నిక‌‌లైనా, త‌‌మ ప‌‌రిపాల‌‌న మీద‌‌, త‌‌మ‌‌ నిర్ణయాల మీద‌‌, తాము చేస్తున్న నియామ‌‌కాల మీద‌‌నే తీర్పు ఇవ్వాల‌‌ని అన్నారు. అంతా ఆలోచ‌‌న చేయాల‌‌ని, ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్లి చ‌‌ర్చించాల‌‌ని విజ్ఞప్తి చేశారు. మ‌‌న తాత‌‌లు, తండ్రులు గొర్రెలు కాస్తే, బ‌‌ర్రెలు కాస్తే, చెప్పులు కుడితే మ‌‌న పిల్లలు కూడా అవే ప‌‌నులు చేయాలా అని అడిగారు. ఈ ప్రభుత్వంలో వారు భాగ‌‌స్వాములు కావ‌‌ద్దా? అని ప్రశ్నించారు. 

నూత‌‌నంగా నియ‌‌మితులైన 543 డిగ్రీ కాలేజీ లెక్చర‌‌ర్లు, 1,463 జూనియ‌‌ర్ కాలేజీ లెక్చర‌‌ర్లు, 2,632 టీజీటీ ఉపాధ్యాయులు, 479 మంది కానిస్టేబుల్స్‌‌, 75 మంది వైద్య సిబ్బందికి హైద‌‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సోమ‌‌వారం నియామ‌‌క ప‌‌త్రాలు అంద‌‌జేశారు. ఈ సంద‌‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రేవంత‌‌న్న అంటే వెంట‌‌నే ప‌‌లుకుతున్న, ప్రజ‌‌లు ఇచ్చిన అవ‌‌కాశంతో ఇక్కడ ఉండి మాట్లాడుతున్న, సీఎం పదవి నా తాత‌‌లు ఇచ్చిన ఆస్తి కాదు. గ‌‌తంలో మంత్రులు ఒక్కనాడైనా సీఎంను క‌‌లిసేవారా..? ఎప్పుడైనా మీరు సీఎంను చూశారా..? క‌‌లిశారా?” అని అడిగారు.

చదువుతోనే వెలుగు

గ‌‌త ప్రభుత్వం రేష‌‌న‌‌లైజేష‌‌న్ పేరిట ఆరు వేల స్కూళ్లను మూసివేసి ద‌‌ళితులు, గిరిజ‌‌నులు, వెనుక‌‌బ‌‌డిన ప్రాంతాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసిందని రేవంత్ విమర్శించారు. బ‌‌ర్రెలు కాసుకునే వారు బ‌‌ర్రెలు కాసుకోవాలె, గొర్రెలు పెంచుకునే వారు గొర్రెలు కాసుకోవాలె, చేప‌‌లు ప‌‌ట్టుకునే వారు చేప‌‌లు ప‌‌ట్టుకోవాలె అనే ప‌‌థ‌‌కాలు తీసుకొచ్చింద‌‌ని విమర్శించారు.

 గత సీఎం మ‌‌న‌‌వ‌‌డు పెంచుకున్న కుక్క చ‌‌నిపోతే వెట‌‌ర్నరీ డాక్టర్‌‌పై కేసు పెట్టి లోప‌‌ల వేశార‌‌ని, మ‌‌రి ఉద్యోగాలు రాక వంద‌‌లాది మంది విద్యార్థులు ఆత్మహ‌‌త్యలు చేసుకుంటుంటే వాళ్లను (నాటి పాల‌‌కుల‌‌ను) ఉరి వేయాలా వ‌‌ద్దా అని ఫైర్​అయ్యారు. వారి పెంపుడు కుక్కకున్న విలువ పేద‌‌ల ప్రాణాల‌‌కు లేదా అన్నారు. ప్యూడ‌‌ల్ విధానాలు మారాలని.. విద్య పేద‌‌వాళ్లకు చేరాలన్నారు.

గురుకులాల్లో సౌలత్​లు కల్పించారా?

రాష్ట్రంలో గురుకుల పాఠ‌‌శాల‌‌లు పెట్టామని గ‌‌త పాల‌‌కులు చెబుతున్నార‌‌ని, వాటిలో ఎక్కడైనా మౌలిక వ‌‌స‌‌తులు క‌‌ల్పించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే మోడ‌‌ల్ గురుకుల పాఠ‌‌శాల తీసుకురావాల‌‌ని కొడంగ‌‌ల్ నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో రూ.25 ఎక‌‌రాల్లో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌‌ని, 119 శాస‌‌న‌‌స‌‌భ నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల్లో అవ‌‌కాశం ఉన్న చోట ఈ మోడల్ క్యాంప‌‌స్‌‌లు ఏర్పాటు చేయాల‌‌ని భావిస్తున్నామ‌‌ని తెలిపారు. 

తాను కూడా సర్కార్​బడిలోనే చ‌‌దువుకున్నాన‌‌ని, ఇప్పుడు రాష్ట్ర సీఎం అయ్యానంటే నాడు ప్రభుత్వ బడిలో అందించిన విద్యనే కార‌‌ణ‌‌మ‌‌న్నారు. గుంటూరు.. మ‌‌రెక్కడో చ‌‌దువుకున్న కొంద‌‌రు త‌‌న‌‌కు ఇంగ్లిష్ రాద‌‌ని అవ‌‌హేళ‌‌న చేస్తున్నార‌‌ని ఆయ‌‌న విమ‌‌ర్శించారు. ఇంగ్లిష్ అనేది ఓ భాష‌‌, ప్రపంచంలో ఉద్యోగ క‌‌ల్పన‌‌కు ఉప‌‌యోగ‌‌ప‌‌డుతుంద‌‌ని.. ఆ రోజుల్లో తమకు ఉన్న అవ‌‌కాశాల‌‌ను మేరకు అక్కడ నేర్పిన చ‌‌దువులు నేర్చుకున్నామ‌‌న్నారు.

నమ్మకం కల్పించేందుకే

‘‘మా ప్రభుత్వం వ‌‌చ్చింది.. మాకు ఉద్యోగాలు వ‌‌స్తా య‌‌నే న‌‌మ్మకం నిరుద్యోగుల‌‌కు క‌‌ల్పించడానికి నియామ‌‌క ప‌‌త్రాలు అంద‌‌జేసే కార్యక్రమం చేప‌‌డు తున్నం. ఇదే ఎల్బీ స్టేడియంలో 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల‌‌కు ఉచిత క‌‌రెంట్, రైతుల‌‌పై ఉన్న అక్రమ కేసులు, విద్యుత్ బ‌‌కాయిలు ర‌‌ద్దు చేస్తూ మొద‌‌టి సంత‌‌కం చేసి మ‌‌న ప్రాంతంలో రైతును రాజును చేసేందుకు పునాది వేసింది” అని రేవంత్ అన్నారు. మూడు నెల‌‌ల కాలంలోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవ‌‌కాశాలు క‌‌ల్పించే సంత‌‌కాలు పెట్టామ‌‌న్నారు.

పేదలకు అండగా మా ప్రభుత్వం

ఫామ్ హౌస్ మ‌‌త్తులో ఉన్న గ‌‌త పాల‌‌కులు ల‌‌క్షల మంది యువ‌‌కుల ఆకాంక్షలను నెర‌‌వేర్చడంలో  ఫెయిల్​ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం త‌‌మ ప్రభుత్వం, త‌‌న మంత్రివ‌‌ర్గ స‌‌హ‌‌చ‌‌రులు పేద‌‌లకు అండ‌‌గా నిల‌‌బ‌‌డాల‌‌నే ఆలోచ‌‌న‌‌తో ప‌‌ని చేస్తున్నార‌‌ని చెప్పారు. ఇంకా చేయాల‌‌నే త‌‌ప‌‌న త‌‌మకు ఉంద‌‌ని.. అంద‌‌రి ప్రోత్సాహం, ఆశీర్వాదం, స‌‌హ‌‌కారం త‌‌మ‌‌కు ఉండాల‌‌ని ఆకాంక్షించారు.

 యువ‌‌త చాలాచోట్ల డ్రగ్స్‌‌, గంజాయి, వ్యస‌‌నాల‌‌ వైపు పోతున్నద‌‌ని, విలువ‌‌ల‌‌తో కూడిన జీవితాన్ని ఎలా సాగించాలో విద్యాబుద్ధుల‌‌తో పాటు సామాజిక బాధ్యత‌‌ను టీచర్లే నేర్పాల‌‌ని సూచించారు. 6,546 ఉద్యోగ నియామ‌‌క ప‌‌త్రాలు ఇవ్వాల‌‌నుకున్నామ‌‌ని, ఎమ్మెల్సీ ఎన్నిక‌‌ల కోడ్‌‌తో కొన్ని నియామ‌‌క ప‌‌త్రాలు ఆగాయ‌‌ని, ఈ రోజు 5,192 ఉద్యోగ నియామ‌‌కాలు చేప‌‌డుతున్నామ‌‌ని సీఎం తెలిపారు. మిగ‌‌తా వారికి కోడ్ పూర్తికాగానే వారి ఇళ్లకు నియామ‌‌క ప‌‌త్రాలు పంపుతామ‌‌న్నారు.