స్టేడియాలను ప్రైవేటు కట్టబెడితే ఊరుకోం..

స్టేడియాలను ప్రైవేటు కట్టబెడితే ఊరుకోం..
  • ఈనెల 28 నుంచి ప్రత్యక్ష ఆందోళన
  • 25వేల ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజీ అని.. ఉన్న స్టేడియాలను ప్రైవేటుకు కట్టబెడ్తుండ్రు
  • తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా అస్సలు స్పోర్ట్స్ పాలసీయే లేదు
  • జయేష్ రంజన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడై 20 నెలలు గా బాధ్యతలు తీసుకోలేదు 
  • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్: 25 వేల ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజీ నిర్మిస్తామని చెప్పి... ఉన్న స్టేడియాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా ఇంత వరకు రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీనే తీసుకురాలేదని ఆయన విమర్శించారు. శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రధాన స్టేడియాలని ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలోని స్థలాన్ని ఇతర సంస్థలకు ఇవ్వడానికి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
గచ్చిబౌలి స్టేడియం టవర్ లో టిమ్స్ అభివృద్ధి చెందాలని అనుకున్నాం, స్టేడియం మధ్యలో 5 ఎకరాల స్థలాన్ని టీమ్స్ కు  కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సంబంధం లేని వ్యక్తులతో పంచనామా పై సంతకం చేయించారని విమర్శించారు. ఈ నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, క్రీడా కారుల తో, క్రీడా ప్రేమికులతో కలసి ఈనెల 28న మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రఘునందన్ రావు హెచ్చరించారు. పీవీ సింధు ఏ అంతర్జాతీయ వేదిక పైన కూడా ఆంధ్ర క్రీడాకారిణి గానే ప్రజంట్ చేసుకుంటుంది తప్ప తెలంగాణ గురించి మాట్లాడడం లేదన్నారు. 
కేటీఆర్ కు ఆటలకు ఏం సంబంధం.. ఒలింపిక్ అసిసోసియేషన్ లో వేలు పెట్టారు
మంత్రి కేటీఆర్ కు ఆటలకు ఏం సంబంధం .. ఒలింపిక్ అసోసియేషన్ లో వేలు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. జయేష్ రంజన్ ని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు.. 20 నెలలుగా బాధ్యతలు తీసుకోలేదు, అధ్యక్షుడు గా బాధ్యతలు తీసుకోవడానికి ఆయనకు చీఫ్ సెక్రటరీ అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. గజ్వేల్ లో 50 కోట్లతో స్టేడియం కట్టడం కాదు హైదరాబాద్ లో ఉన్న స్టేడియాలని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్రీడల శాఖ మంత్రి నియోజక వర్గానికి స్టేడియం మంజూరు చేయరు కానీ... గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రం స్టేడియాలు మంజూరు చేసుకున్నారని ఆయన విమర్శించారు.