జూబ్లీహిల్స్ ఉపఎన్నిక స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్..40 మందితో బీఆర్ఎస్ లిస్ట్ విడుదల

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్..40 మందితో బీఆర్ఎస్ లిస్ట్ విడుదల

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్​ పార్టీ స్టార్​ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం 40 మంది సీనియర్​ నాయకుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్​ ప్రతిపాదించగా.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆ జాబితాకు మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో స్టార్​క్యాంపెయినర్లుగా కేసీఆర్​తో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్, ప్రశాంత్​ రెడ్డి, జగదీశ్​ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్​ రాజు, పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి, తాతా మధుసూదన్, ఎల్ రమణ, తక్కెళ్లపల్లి రవీందర్​రావు, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కృష్ణారావు, కేపీ వివేకానంద్, సుధీర్​ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్​ రెడ్డి, మల్లారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, అనిల్​జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్​ రెడ్డి, ముఠా గోపాల్​ తదితర నేతలున్నారు.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్​ పాల్గొంటారా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫాంహౌస్​కే పరిమితమయ్యారు. పార్టీ యాక్టివిటీస్​పై అక్కడి నుంచే రివ్యూలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోనూ అసెంబ్లీ సమావేశాలకు  హాజరుకావడం లేదు. వరంగల్​ సభ తర్వాత ఎలాంటి రాజకీయ సభలకు వెళ్లలేదు. అటు నియోజకవర్గ  ప్రజలకు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్​ క్యాంపెయినర్​గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం చేస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్​ప్రచారం చేస్తే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయ పడినందునే ఆయన పేరు స్టార్​క్యాంపెయినర్ల జాబితాలో చేర్చించినట్టు పార్టీనేతలు అంటున్నారు. 

ఇప్పటికైతే కేసీఆర్​ ప్రచారానికి దూరంగానే ఉంటారని , ప్రచారం చివరి దశలో వీలైతే ఆయనతో ఓ సభ నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉప ఎన్నికలో కేసీఆర్​ప్రచారం చేస్తే తమ అభ్యర్థికి కలిసివస్తుందని పార్టీలోని ఓ వర్గం నేతలు అంటుండగా.. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాని ఆయన, కేవలం ఎన్నికల కోసమే బయటకు వస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరో వర్గం నేతలు అభిప్రాయపడ్తున్నారు.