కేసీఆర్​ 22 కొత్త ల్యాండ్​ క్రూజర్లు కొని దాచిపెట్టిండు : సీఎం రేవంత్‌ రెడ్డి

కేసీఆర్​ 22 కొత్త ల్యాండ్​ క్రూజర్లు కొని దాచిపెట్టిండు : సీఎం రేవంత్‌ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ అనవసరపు ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఆయన మూడోసారి గెలిస్తే తిరిగేందుకు కొత్తగా 22 క్రూజర్ కార్లు కొని దాచారని తెలిపారు. ‘‘కాన్వాయ్ కోసం నేను కొత్త బండ్లు కొనను.. ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాతబండ్లనే రిపేర్ చేసి, అడ్జెస్ట్ చేసి ఇవ్వండని అడిగాను. అయితే.. నేను సీఎం అయిన 10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచి పెట్టినట్టు ఓ అధికారి చెప్పాడు. 

‘22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచి పెట్టాం. మళ్లీ అధికారంలోకి రాగానే తీసుకొద్దామని అనుకున్నాం. కానీ కేసీఆర్ నెత్తిమీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు’ అని సదరు అధికారి నాతో చెప్పాడు” అని రేవంత్ అన్నారు. అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా? అని ప్రశ్నించారు. ఒక్కో ల్యాండ్​ క్రూజర్​ బండికి  రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని.. బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని విమర్శించారు. 22 కొత్త క్రూజర్లు ప్రభుత్వ ఆస్తి అని, తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని చెప్పారు.