‘చలో ట్యాంక్‌బండ్‌’తో కేసీఆర్ పతనం మొదలైంది

‘చలో ట్యాంక్‌బండ్‌’తో కేసీఆర్ పతనం మొదలైంది

సమైక్య పాలకులకు కేసీఆర్‌కు తేడా లేదు
హక్కుల కోసం గళమెత్తితే నిర్బంధాలేంటి?
ఉద్యమానికి భయపడే అక్రమ అరెస్టులు
అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కరీంనగర్ ఎంపీ సంజయ్ ధ్వజం

కేసీఆర్ నియంతృత్వ, నిర్బంధ పరిపాలనకు పతనం ప్రారంభమైందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో ట్యాంక్‌బండ్‌’తోనే తెలంగాణ సమాజం కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి నాంది పలికిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. పోలీసుల వలయం చేధించుకుని వందలమంది కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినదించారు. చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తుంటే…. కేసీఆర్ మాత్రం చట్ట విరుద్ధమైన వ్యాఖ్యలతో కార్మికులను పొట్టన పెట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రిలో చలనం రావడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమాలను అణచి వేయడం దారుణమని సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కేసీఆర్ కార్మికుల బాధలను పట్టించుకోకపోతే తాము కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఆయన తెలిపారు.

ఉద్యమానికి భయపడిన కేసీఆర్.. శుక్రవారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ వివిధ పార్టీల నేతలను అక్రమంగా అరెస్టు చేయించారని ఆయన ధ్వజమెత్తారు. అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని ఆయన అన్నారు. కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం కూడా స్పందించలేదని ఆయన మండిపడ్డారు. 2011లో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ ద్వారా తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు. ఉద్యమం రుచి ఎట్లుంటదో చూపించామవి, కేసీఆర్ ఇప్పటికైనా దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

కార్మికులు, కార్యకర్తలపై లాఠీ ఛార్జ్.. అరెస్టు

వందలాది మంది కార్యకర్తలతో ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లిన ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేసి, అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల తీరును బండి సంజయ్ తప్పుబట్టారు. కార్యకర్తలపై లాఠీఛార్జి ఆపాలంటూ పోలీసులను నిలదీశారు. శాంతియుతంగా నిర్వహించిన ఆందోళనపై దౌర్జన్యం తగదని అన్నారు. తాము చేస్తున్న ఉద్యమం పోలీసులకు వ్యతిరేకం కాదని అన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి… రాజకీయ పార్టీలు, కార్మికులు, పోలీసులకు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. సమైక్య పాలకులకు, కేసీఆర్‌కు తేడా లేదని సామాన్య ప్రజలు సైతం గుర్తించారని ఆయన విమర్శించారు. ఇప్పటికయినా కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమంలో ఎంపీ సంజయ్‌తో పాటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టె మురళీకృష్ణ, బీజేపీ కరీంనగర్ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, నాయకులు బల్బీర్ సింగ్, నాగమల్ల సురేశ్, కరండ్ల మధుకర్, కటుకం లోకేశ్‌లు పాల్గొన్నారు. పోలీసుల లాఠీఛార్జిలో బేతి మహేందర్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.