అసోం సీఎం వ్యాఖ్యలను ఖండిస్తే కాంగ్రెస్కు మద్దతిచ్చినట్లా?

 అసోం సీఎం వ్యాఖ్యలను ఖండిస్తే కాంగ్రెస్కు మద్దతిచ్చినట్లా?
  • మార్చాలనుకుంటున్న రాజ్యాంగానికి అక్రమ అరెస్టులే ప్రతీక
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గృహ నిర్బంధం

జగిత్యాల: కేసీఆర్ మార్చాలనుకుంటున్న రాజ్యాంగానికి అక్రమ అరెస్టులే ప్రతీక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  పేర్కొన్నారు.  అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. తనను గృహ నిర్బంధం చేయడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాజ్యాంగాన్ని మార్చాలని ఇటీవల సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు.. ఆయన మార్చాలనుకుంటున్న రాజ్యాంగానికి ఈ అక్రమ అరెస్టులే ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరికి తన అభిప్రాయాలను చట్టబద్ధంగా వెల్లడించే అవకాశం ఉంది..కానీ అసోం ముఖ్యమంత్రి సమాజంలో అశాంతి రేగే విధంగా, భారత సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా ఖండించారు. కేసీఆర్ అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన కాంగ్రెస్కు మద్దతిచ్చినట్లు కాదని ఆయన అన్నారు. కానీ తాము అసోం ముఖ్యమంత్రిపై వివిధ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు పై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసోం సీఎం వ్యాఖ్యల పట్ల మహిళల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని సొమ్ము చేసుకుని వారి సానుభూతి పొందేందుకే కేసీఆర్ తెలివిగా మాట్లాడారని  తెలిపారు. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తాము వివిధ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు పై కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ సమత అంటే ఇదేనా..?  చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మీ పార్టీ ముఖ్యమంత్రి దేశ సంస్కృతిని, భారతరత్న రాజీవ్ గాంధీ కుటుంబ మూలాలను ప్రశ్నించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోరా? అని ఆయన ప్రశ్నించారు.