రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు విలీనం!

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు విలీనం!
  •     రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ రద్దు?
  •     తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు అంతా కలెక్టర్ల పరిధిలోకి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇన్నాళ్లు వేర్వేరు శాఖలుగా ఉన్న రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. భూముల రిజిస్ట్రేషన్లలో రెండు శాఖలు నిర్వహించేది ఒకే విధమైన పనులే అయినప్పటికీ వేర్వేరు శాఖలుగా కొనసాగించడం ఎందుకనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అగ్రికల్చర్ ల్యాండ్స్ తోపాటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్  రిజిస్ట్రేషన్లను కూడా ధరణి పోర్టల్ ద్వారానే నిర్వహించాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రెండు శాఖలను విలీనం చేయాలని భావిస్తోంది.

డీఐజీ, ఐజీ పోస్టులు కూడా రద్దు?

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు జిల్లా బాస్ గా జిల్లా రిజిస్ట్రార్ వ్యహరిస్తున్నారు. జిల్లాకో రిజిస్ట్రార్ తోపాటు జోన్ స్థాయిలో డీఐజీ, రాష్ట్ర స్థాయిలో ఐజీ అండ్ కమిషనర్ ఉన్నతాధికారులుగా ఉన్నారు. అయితే భూపరిపాలనను మొత్తం ఒకే గొడుగు కింది తీసుకొస్తున్న ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్ పోస్టుతోపాటు డీఐజీ, ఐజీ పోస్టులను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో తహసీల్దార్/ జాయింట్ సబ్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ లపై జిల్లా స్థాయి అధికారిగా కలెక్టర్ వ్యవహరించనున్నట్లు సమాచారం. ఆయన బాధ్యతలను అడిషనల్ కలెక్టర్లు నిర్వహిస్తారని తెలిసింది. అలాగే రెవెన్యూ, రిజిస్ట్రార్ శాఖలకు కలిపి రాష్ట్ర స్థాయి హెచ్ఓడీ పోస్టు అయిన కమిషనర్ స్థానంలో ఒకరినే నియమించనున్నట్లు సమాచారం.

ఎల్ఆర్ఎస్ అయిన భూములే ధరణిలోకి..

రాష్ట్రంలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం సుమారు కోటిపైగా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలు ఉన్నాయి. రిజిస్టర్ అయిన ప్రతి ఆస్తి సమాచారం ఆ శాఖ వద్ద డిజిటలైజ్ అయి ఉంది. కానీ ఈ డేటా అంతా ధరణి పోర్టల్ లో కనిపించే పరిస్థితి లేదు. ఎల్ఆర్ఎస్ అయిన ప్లాట్లను మాత్రమే ఇక మీదట రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో రిజిస్ట్రేషన్ శాఖలో డేటా ఉన్నప్పటికీ.. ఎల్ఆర్ఎస్ కాని ప్లాట్లను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 25 లక్షల అప్లికేషన్లు దాటాయి. ఈ ప్లాట్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముగిశాకే ధరణిలో
కనిపించనున్నాయి.