ఇయ్యాల తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్

ఇయ్యాల తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్
  • అమిత్​షా అధ్యక్షతన సమావేశం
  • రాష్ట్రం నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్! 
  • రాష్ట్ర ప్రాజెక్టులపై కర్నాటక, ఏపీ పలు అభ్యంతరాలు
  • ముఖ్యమైన మీటింగ్​కు సీఎం వెళ్లకపోవడంపై సర్వత్రా చర్చ

హైదరాబాద్, వెలుగు: తిరుపతిలో ఆదివారం జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరవడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఏపీ పునర్విభజన చట్టం హామీల అమలు ప్రధాన ఎజెండాగా జరుగుతున్న ఈ భేటీకి హోంమంత్రి అమిత్​షా అధ్యక్షత వహించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అందరూ హాజరవుతుండగా ఈ భేటీకి కేసీఆర్ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కర్నాటక, ఏపీ రాష్ట్రాలు మనం కడుతున్న పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి వంటి లిఫ్ట్ స్కీమ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ మీటింగ్​లో చర్చించాలని కేంద్రాన్ని కోరాయి. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు, కేఆర్​ఎంబీ జ్యూరిస్ డిక్షన్ వంటి ప్రధాన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ముఖ్యమైన సమావేశానికి సీఎం వెళ్లకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేని హోంమంత్రి మహముద్ అలీని పంపుతుండడం గమనార్హం. రాజకీయ వ్యూహంలో భాగంగానే మీటింగ్​కు వెళ్లడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, హామీలపై నిలదీయాల్సిన సీఎం మీటింగ్​కు దూరంగా ఉండటంపై ఆఫీసర్లు ఆశ్చర్యపోతున్నారు.

సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధాన చర్చ
మీటింగ్​లో 26 అంశాలతో పాటు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఎజెండా కాపీని రాష్ట్ర సర్కార్​కు పంపింది. పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి లిప్ట్ స్కీమ్​లపై తెలంగాణ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో కేఆర్​ఎంబీ జోక్యం చేసుకోవాలని, సర్ ప్లస్ వాటర్ వాడుకునేందుకు పెద్ద లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కట్టడంపై కర్నాటక, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్​లో ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేఆర్​ఎంబీ జ్యురిడిక్షన్ పై గెజిట్ వచ్చిందని, ఏపీ, తెలంగాణ అంగీకరించకపోగా వేర్వేరు స్టాండ్స్ తీసుకోవడం ఏంటని కర్నాటక ప్రశ్నిస్తోంది. పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులు కట్టడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.మీటింగ్​లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నరు. రాష్ట్ర సర్కార్ 3.3 టీఎంసీలతో సంగంబండ బ్యారేజీ నిర్మిస్తోంది. దీంట్లో కర్నాటకకు చెందిన భూములు మునుగుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని అప్పటి వరకు కట్టొద్దని కర్నాటక వాదిస్తోంది. తుంగభద్రపై గుండ్రేవుల వద్ద ఏపీ ప్రాజెక్టు కడుతోంది. తెలంగాణ, కర్నాటక దీనిమీద జాయింట్ సర్వే అడుగుతున్నాయి. 

రాజకీయ వ్యూహమేనా?
హుజూరాబాద్ బై ఎలక్షన్ తరువాత ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను అనుకూలంగా మలుచుకొనే అవకాశం ఉందని గ్రహించిన సీఎం కేసీఆర్ సడెన్ గా రూట్ మార్చారు. మొన్నటివరకు వరుస ఢిల్లీ పర్యటనలతో కేంద్ర పెద్దలను కలసి...రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేసిన ఢిల్లీ పెద్దలతో సఖ్యత ఉందనే సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. అయితే ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు తరువాత ఆ పార్టీ నేతలు స్వరం పెంచడంతో నేరుగా సీఎం రంగంలో దిగి గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ నిర్ణయాలపై విమర్శలు చేశారు. గతంలోనూ సదరన్​జోనల్ మీటింగ్​లకు సీఎం హాజరు కాలేదు. కానీ ఇప్పుడు పక్కనే ఉన్న ఏపీలోనే మీటింగ్ జరుగుతుండటం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ ఉన్నా... దూరంగా ఉండటం కేంద్రం, ఏపీపై గుర్రుగా ఉన్నామనే సంకేతాలు పంపడంలో భాగమేనని తెలుస్తోంది.

కరెంట్ బకాయిలు కోరుతున్న ఏపీ 
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాడుకున్న కరెంట్​కు డబ్బులు ఇవ్వలేదని.. వెంటనే ఇచ్చేలా టైం పీరియడ్ పెట్టాలని మీటింగ్​లో ఏపీ కోరనుంది. తెలంగాణ డిస్కంలు సుమారు రూ.7 వేల కోట్లకు పైగా ఏపీకి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.6,015 కోట్లు పెండింగ్​బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కోరనుంది. కేంద్ర పథకాలను రాష్ట్రాలు ఎట్ల అమలు చేస్తున్నాయనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఏయే రాష్ట్రాలు ఏ పథకాలకు డీబీటీ అమలు చేస్తున్నాయనే దానిపై కేంద్ర హోంశాఖ ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనుంది. మహిళలపై నేరాలు, హింసపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? స్టేట్ హైవేస్, రైల్వేస్ చర్చించనున్నారు.