కేసీఆర్... బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించే తీరిక లేదా..?

కేసీఆర్... బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించే తీరిక లేదా..?

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా..సీఎం కేసీఆర్కు కళాశాలను సందర్శించే తీరిక లేకపోవడం విచారకరమని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బాసర ఐటీ విద్యార్థులు తమ కళాశాలను సందర్శించాలని సీఎం కేసీఆర్ ను కోరినా.. పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు, నిరుద్యోగు పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్కు  సీఎంగా గుర్తింపు దక్కిందంటే.. అది ఉద్యమనాయకుడిగా ఉన్న గుర్తింపుతోనే అని చెప్పారు.  9 ఏళ్ల బడ్జెట్లో బాసర ట్రిపుల్ ఐటీకి  రూ.1,167 కోట్లు  కేటాయిస్తే, అందులో ఖర్చు చేసింది కేవలం 294 కోట్లు మాత్రమే అని తెలిపారు. 

సాంకేతిక విద్యకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో  బాసరలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇంటర్ స్థాయిలో సాంకేతిక విద్యతో పాటు బలహీన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య అందించేందుకే ఈ కళాశాలను నెలకొల్పారని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ 9000 మందికి రెసిడెన్షియల్ విద్య అందిస్తోందన్నారు. అలాంటి కాలేజీ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందుతుందని.. మెరుగైన వసతుల కల్పన జరుగుతుందని ఆశించామన్నారు. వసతుల కల్పన కాదు కదా..కనీస సౌకర్యాలు లేవన్నారు. 

బాసర కాలేజీలో చదవుతున్న  విద్యార్థులు సీఎం కేసీఆర్ మనవరాళ్లు, మనవళ్ల వంటి వారే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.  ఇప్పటికైనా సీఎం కేసీఆర్ భేషజాలకు పోకుండా..బాసర ట్రిపుల్ ఐటీలో సరైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నాసిరకం భోజనం కల్పిస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి మళ్లీ  టెండర్ పిలవాలన్నారు. తరగతి గదుల్లో డెస్క్లు, కళాశాలలో టాయిలెట్ల ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించాలన్నారు. వైస్ ఛాన్సలర్ను నియమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు బాసర ట్రిపుల్ ఐటీ సందర్శనకు వెళ్తే ప్రభుత్వానికి భయమెందుకు అని ప్రశ్నించారు. విపక్ష నేతలు సందర్శనకు వెళ్తే అరెస్ట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రం భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంతో మంది అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారంటే..ప్రధాని, హోంమంత్రిని కలిసి పరిహారం కోరతారని ఆశించామన్నారు. కానీ రాజకీయ కార్యకలాపాలు, అప్పుల వేటలో ఉన్నారని మండిపడ్డారు. వీటి కోసం సీఎం కేసీఆర్ కాలం గడిపితే ప్రజలు హర్షించరని చెప్పారు.