లెండి ప్రాజెక్ట్​ను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే

లెండి ప్రాజెక్ట్​ను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే
  •      మేం కాంగ్రెస్ ​మిత్రపక్షం  
  •     ప్రాజెక్ట్ ​పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం   
  •     టీజేఎస్ చీఫ్​ కోదండరాం​

కామారెడ్డి, వెలుగు :  మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘లెండి’ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం విమర్శించారు.  ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి తాము మిత్రపక్షంగా ఉన్నామని, ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ ​మినిస్టర్​దృష్టికి తీసుకువెళ్లి పనులు కంప్లీట్​అయ్యేలా చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్​సమీపంలో ఉన్న లెండి ప్రాజెక్ట్​ను మంగళవారం  కోదండరాం సందర్శించారు.

ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మధ్య 1987లో ప్రాజెక్టు గురించి అంగీకారం కుదిరి పనులు మొదలుపెట్టారన్నారు. ప్రాజెక్ట్​ నిర్మాణ ఖర్చును మహారాష్ట్ర 62 శాతం, ఉమ్మడి ఏపీ 38 శాతం భరించాలన్నది ఒప్పందమన్నారు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి అగ్రిమెంట్​ చేసుకున్నారన్నారు. 6.36 టీఎంసీల ఈ ప్రాజెక్ట్​లో మన రాష్ట్రానికి 3.63 టీఎంసీలు వస్తాయని, దాంతో 23 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సాగునీరందుతుందన్నారు.

14 గేట్లకు 8 ఏండ్ల కింద 10 గేట్ల పనులు పూర్తయ్యాయన్నారు. కొంత మేర కాల్వ పనులు కూడా జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ​కంప్లీట్​చేయడానికి, పునరావసానికి రూ.800 కోట్లు అవసరమవుతాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని, విషయాన్ని కాంగ్రెస్​ప్రభుత్వ  దృష్టికి తీసుకువెళ్తానన్నారు. టీజేఎస్​స్టేట్​జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేశ్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ప్రెసిడెంట్లు లక్ష్మణ్, తుల్జారెడ్డి, ప్రతినిధులు డీఆర్.శంకర్, డీపీ రెడ్డి, చందు, రమేశ్​రెడ్డి, హన్మంత్​రెడ్డి పాల్గొన్నారు.