బాయిల్డ్ రైస్ ఇవ్వడంలో కేసీఆర్ విఫలం

బాయిల్డ్ రైస్ ఇవ్వడంలో కేసీఆర్ విఫలం

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తెలంగాణ వరి రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరణ ఇచ్చారు. ధాన్యం విషయంలో తెలంగాణ సర్కార్ తీరు సరిగ్గా లేదని గోయల్ అన్నారు. ఐదు సార్లు గడువు పెంచినా.. బాయిల్డ్ రైస్ ఇవ్వడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్నారు. 

‘వరి కొనుగోళ్లపై పదేపదే అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి కొనుగోళ్ల చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ డీపీసీ స్టేట్ అని గుర్తుంచుకోవాలి. డీపీసీసీ స్టేట్ అంటే ఆ రాష్ట్రంలో ధాన్యాన్ని ఎఫ్ సీఐ నేరుగా కొనుగోళ్లు చేయదు. రాష్ట్ర సర్కారు వరి కొని, దాన్ని బియ్యంగా మార్చిన తర్వాత ఎఫ్ సీఐకి ఇస్తుంది. కొనుగోళ్ల విషయంలో పెద్ద మొత్తంలో రైస్ ఇచ్చేందుకు ఐదు నుంచి ఆరు సార్లు తెలంగాణ ప్రభుత్వానికి మేం పొడిగింపును ఇచ్చాం. కానీ బాధతో చెబుతున్నా.. భారీ స్థాయిలో కొంటామని పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. ఎఫ్ సీఐకి పారాబాయిల్డ్ రైస్ ఇవ్వడంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. అయినా మేం రెడీగా ఉన్నాం. మళ్లీ పొడిగింపును ఇచ్చాం. తెలంగాణ నుంచి ఎంత వేగంగా రైస్ అందిస్తే అంతే వేగంగా తీసుకోవడానికి ఎఫ్ సీఐ సిద్ధంగా ఉంది. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. కేంద్ర సర్కారు కాదు’ అని లోక్ సభలో పీయూష్ గోయల్ చెప్పారు. 

పీయూష్ గోయల్ సమాధానంపై ఉత్తమ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గోయల్ జవాబు కేంద్ర నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ‘తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనబోదని పీయూష్ గోయల్ పార్లమెంటులో నిర్లక్ష్యంగా బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణీత MSPకి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే, మరి MSP ఎందుకు ఉన్నట్లు? బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వరి రైతుల ఉసురు తీస్తున్నాయి. ప్రతి ధాన్యపు గింజను కొంటానని చెప్పి.. కేసీఆర్ రైతులను మోసం చేశారు’ అని ఉత్తమ్ కుమార్ ట్వీట్ లో విమర్శించారు.